స్టాల్ ఇన్ మాల్‌తో…
- గ్రామీణ హస్తకళాకారులకు..
- స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం..
- పట్టణ ప్రాంత ప్రజల అభిరుచులకు తగ్గట్లు అందుబాటులో ఉత్సత్తులు..
- జనవరి 9 వరకు స్టాల్ ఇన్ మాల్ ద్వారా ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు..
- నగర ప్రజలు హస్తకళాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలి..
- నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంఎం బెహ్రా…
(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించి ఉపాధి అవకాశాలు మెరుగు పరచాలనే లక్ష్యంతో ప్రైవేటు షాపింగ్ మాల్స్‌లోనూ స్టాల్ ఇన్ మాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) ఎంఎం బెహ్రా (MM Behra) అన్నారు.
నాబార్డ్ ఆర్థిక సహాయంతో నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని పీవీపీ మాల్ (Vijayawada PVP Mall) లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను శుక్రవారం నాబార్డ్ డీజీఎం ఎంఎం బెహ్రా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి, వారి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు కళాత్మక సంపదను భావితరాలకు అందజేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నేస్తం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన చేనేత వస్త్రాలు (Handloom fabrics), జ్యూట్ బ్యాగులు, కలంకారి వస్త్రాలు, కొండపల్లి బొమ్మలు, ముత్యాల దండలు వంటి ప్రదర్శన, అమ్మకాలు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకోవడంతో మంచి సత్ఫలితాలనిచ్చాయన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శన జనవరి 9 వరకు ఉంటుందని.. మన రాష్ట్రంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారన్నారు.
పీవీపీ మాల్‌లో ఏర్పాటుచేసిన స్టాల్ ఇన్ మాల్ (Stall in Mall) ప్రదర్శనను తిలకించి స్వయం సహాయక బృందాల మహిళల ఆర్ధిక పురోగతికి చేస్తున్న ప్రయత్నంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంఎం బెహ్రా కోరారు. నేస్తం సంస్థ సీఈవో వి.సురేష్ మాట్లాడుతూ నాబార్డ్ సహకారంతో విశాఖపట్నం, విజయవాడ పట్టణాలలో స్టాల్ ఇన్ మాల్స్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని, ఒక్కో ప్రదర్శన 90 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. హస్తకళాకారులు, చేతివృత్తిదారులకు 15 రోజులపాటు ప్రదర్శన, అమ్మకాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంత ప్రజలకు గ్రామీణ హస్తకళారూపాలను తయారీ ధరలకే అందించాలనే లక్ష్యంతో పాటు కళాకారులకు మరింత ఆర్ధిక ప్రయోజనం చేకూర్చేలా స్టాల్ ఇన్ మాల్ ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్ అసిస్టెంట్ మేనేజర్ కల్లేష్, నేస్తం స్వచ్ఛంద సంస్థ సిబ్బంది, గ్రామీణ హస్తకళాకారులు తదితరులు పాల్గొన్నారు.