Superbugs | ఢిల్లీలో ప్రమాదకర బాక్టీరియా

Superbugs | ఢిల్లీలో ప్రమాదకర బాక్టీరియా
Superbugs | ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) సైంటిస్టులు కొత్త ఆందోళన కలిగించే విషయాన్ని వెల్లడించారు. నగరంలోని ఇండోర్, అవుట్‌డోర్ గాలి నమూనాల్లో యాంటీబయాటిక్స్‌కు లొంగని సూపర్ బగ్స్ (Superbugs) (స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా) అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
జేఎన్‌యూ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్ (JNU School of Environmental Sciences) పరిశోధకులు హిమాని కుమారి, మధురి సింగ్ నిర్వహించిన అధ్యయనంలో వసంత్ విహార్ స్లమ్, మునిర్కా మార్కెట్, జేఎన్‌యూ సెవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వంటి ప్రాంతాల నుంచి గాలి నమూనాలు సేకరించారు. ఫలితాలు ఆందోళన కలిగించాయి – గాలిలో స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా స్థాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) నిర్దేశించిన పరిమితి కంటే 16 రెట్లు అధికంగా ఉంది.
అధ్యయనంలో 74% బ్యాక్టీరియా సింగిల్ డ్రగ్ రెసిస్టెంట్, 36% మల్టీ డ్రగ్ రెసిస్టెంట్‌గా గుర్తించారు. శీతాకాలంలో ఈ స్థాయి మరింత పెరుగుతుందని, మురికివాడలు, రద్దీ ప్రాంతాల్లో బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ సూపర్ బగ్స్ న్యూమోనియా, బ్లడ్ ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయని, సాధారణ యాంటీబయాటిక్స్ పనిచేయకపోవచ్చని హెచ్చరించారు. పరిశోధకులు గాలి కాలుష్యం బ్యాక్టీరియా వ్యాప్తికి దోహదపడుతుందని, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR)ను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
