Sunday Magazine 23 Nov 2025 | ఆదివారం సంచిక 23 నవంబర్ 2025

Sunday Magazine 23 Nov 2025 | ఆదివారం సంచిక 23 నవంబర్ 2025
ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
–అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
Sunday Magazine సంచికలో…
1.దేశానికి రక్షణ కవచం (ముఖపత్ర కథనం)
2.చెప్పుకోండి చూద్దాం..
3.మనసు-మాట శీర్షిక
4.అత్యాశ – కథ
5.కబుర్లు – శీర్షిక
6.రిక్షా నూకరాజు
7.సన్నిహితం… శీర్షిక
8.ఇదీ వరస
9.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
10.’అగరు ధూపం, ఊదుపొగ’ కవిత్వం – పుస్తక సమీక్ష
11.వినరో భాగ్యము – శీర్షిక
12.చెప్పుకోండి చూద్దాం సమాధానాలు
Sunday Magazine 23 Nov 2025

వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఏదైనా మంచో చెడో జరిగినప్పుడు పైవాడిని తల్చుకుంటాం….”అంతా ఆ పైవాడి దయ…ఆ పైవాడికే నామీద దయలేదు…ఆ పైవాడు రాత రాస్తే మనమేం చేస్తాం?” ఇలా… అంటే మన జీవితమంతా ఆ పైవాడు ముందే రాసేసాడనేగా? ఎక్కడ, ఎలా ఎన్నేళ్ళు బ్రతకాలనేదంతా ఆ పైవాడి ప్రీ-ప్లానేనా? ఇది ఇది పూర్తిగా వ్యక్తిగత భావన్. మన దేశంలో పాలకులూ-పౌరులూ-ప్రతి వృత్తిలోనివారూ ఎవరు ఎలా బ్రతకాలి? ఏయే హక్కులు పొందాలి? ఏయే విధులు అనుసరించాలి అనేదంతా ముందే రాసారు మన రాజ్యాంగంలో. భారత రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్.
రాజ్యాంగం గురించి ఎవరికి ఏం తెలుసు..? ఎంత తెలుసు?
ఎంత తెలుసు అనేదానికన్నా “ఎంతో తెలియదు” అని చెప్పుకోవడం కరెక్ట్ అవుతుందేమో. తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాల్లో రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతాంశాలు ప్రస్తావించాల్సిన అవసరముంది. ఎందుకంటే, సాధారణ పౌరుల్లో, ఎవరైనా ఏదైనా అన్యాయానికి గురై మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడినా, అక్రమాలను ఎదిరించలేక కృంగిపోయినా, వారికి తమ హక్కుల గురించి అవగాహన లేకపోవడం వల్లనే.
నవంబరు 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవం
ప్రతి సంవత్సరం నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాము. 1949లో ఈ రోజున రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 72 ఏళ్ల క్రితం 284 మంది సభ్యులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు 11,000కు పైగా సమావేశాలు నిర్వహించి, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియ మొత్తానికీ డా.బి.ఆర్. అంబేడ్కర్ నాయకత్వం వహించారు. ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చి, భారత దేశం సార్వభౌమ గణతంత్ర దేశంగా అవతరించింది.
రాజ్యాంగ అమలు– భారత దేశ చరిత్రలో ఒక మైలురాయి
1950లో అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఉన్నవి 395 ఆర్టికల్స్, 22 భాగాలు, 8 షెడ్యూల్స్. ఇప్పటిదాకా జరిగిన 108 సవరణలతో ప్రస్తుతం 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ గా విస్తరించింది. ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో సవరణలు చేసిన రాజ్యాంగం కూడా మనదే కావడం విశేషం. 42వ సవరణ (1976)లో “సోషలిస్ట్, సెక్యులర్” అనే పదాలు చేర్చారు. 73వ, 74వ సవరణలతో పంచాయతీలు, మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా ఇచ్చారు.
రాజ్యాంగం ద్వారా భారత్‌ను బలోపేతం చేసిన కొన్ని చారిత్రక ఘట్టాలు.
ఆర్టికల్ 21A 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య
ఆర్టికల్ 370 రద్దు(2019)–జమ్మూ కాశ్మీర్ పూర్తి భారత్‌లో విలీనం
ఆర్టికల్ 21 గోప్యత హక్కును మౌలిక హక్కుగా గుర్తింపు(2017)
జీఎస్టీ(101వ సవరణ)ఒకే దేశం, ఒకే పన్ను
ఓబీసీ రిజర్వేషన్(103వ సవరణ) ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోటా
ఆందోళన కలిగించే మరో కోణం.. రాజ్యాంగ దుర్వినియోగం.
ఆర్టికల్ 356, రాష్ట్రాల్లో అధ్యక్ష పాలనను 100కు పైగా సార్లు విధించారు. ఇందులో చాలాసార్లు రాజకీయ ప్రయోజనాల కోసమే అనేది బహిరంగ రహస్యం. 1975–77 లో అత్యవసర పరిస్థితి తో రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి పౌర హక్కులు హరించారు. ఆర్టికల్ 35ఏ. జమ్మూ కాశ్మీర్‌లో స్థానికులకు ప్రత్యేక హక్కులు ఇవ్వడం ద్వారా దేశ ఐక్యతకు భంగం కలిగించారు. నేషనల్ జ్యూడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ ’99వ సవరణ’ న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ జోక్యం ప్రయత్నం దీన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది.
నేతలకు రాజ్యాంగ అవగాహన ఎంత ?
దురదృష్టవశాత్తు, చాలా మంది రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని ఓటు బ్యాంక్ సాధనంగా మాత్రమే చూస్తున్నారు. రిజర్వేషన్లు, మత రాజకీయాలు, రాష్ట్ర విభజనలు ఇవన్నీ రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. 2019లో ఒక సర్వే ప్రకారం, కేవలం 27% మంది భారతీయులు మాత్రమే తమ మౌలిక హక్కుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. చాలా మంది పౌరులు ఆర్టికల్ 19 మాట్లాడే స్వేచ్ఛ, ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి కూడా సరిగా తెలుసుకోలేదు.
రాజ్యాంగ భవిష్యత్తు భారత పౌరులందరి బాధ్యత !
రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి పౌరుని కర్తవ్యం. స్కూళ్లలో రాజ్యాంగ ఉపోద్ఘాత పఠనం తప్పనిసరి చేయాలి. యువతగా ఎదిగే నాటికే వారిలో రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన పెంపొందుతుంది. నాయకులు రాజ్యాంగ ఆశయాలను కాపాడుకుంటూ పరిపాలన సాగించాలి. రాజ్యాంగ దినోత్సవం అంటే కేవలం ఒక రోజు తలచుకోవలసిన దినం మాత్రమే కాదు. ఏడాదిలో ప్రతి రోజూ రాజ్యాంగ బద్ధంగా జీవించాలని గుర్తుచేసే పండుగ!
డా. బీ.ఆర్. అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే, “మనం రాజ్యాంగాన్ని రక్షించడం లేదు… రాజ్యాంగం మనల్ని రక్షిస్తోంది!” అవును, సరిగా తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే, మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలం, బలం, మన స్వేచ్చాయుత జీవన విధానానికి రక్షణ కవచం…మన రాజ్యాంగం.
బలహీనమైన రాజ్యాంగ వ్యవస్థల వల్ల పౌరులకు స్వేచ్చ లేక, పాలకులకే రక్షణ లేక అంతర్యుద్దాలతో అతలాకుతలం అవుతున్న మన పొరుగు దేశాలను చూస్తున్నప్పుడు, మన రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ నిర్మాతల పట్ల మనసు ఉప్పొంగకమానదు. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి చదవాలి, అర్థం చేసుకోవాలి. దాని ఆశయాలను ఆచరించాలి.
జై హింద్! జై భారత రాజ్యాంగం!
Sunday Magazine 23 Nov | 2.చెప్పుకోండి చూద్దాం..
ఈ ఫోటోలో ఉన్నది ఎవరెవరో చెప్పుకోండి చూద్దాం..

Sunday Magazine – 23 Nov | 3.మనసు-మాట శీర్షిక

బంధాలలో ప్రేమ మరియు గౌరవంలో ఏది ముఖ్యము?
ఈ ప్రశ్న మీ మనసులో ఎప్పుడైనా మెదిలిందా?
తెలుసుకోవాలనుకుంటే—ఈ వారం క్లయింట్ల మనసు–మాట ద్వారా తెలుసుకుందాం.
అగౌరవం గురించి క్లయింట్ల మనసు-మాటలు
చేతన్: “నాకు పెళ్లై పది సంవత్సరాలు. నా భార్యకు నా జీతం, నేను ఇవ్వగలిగే జీవితం ఏదీ నచ్చదు. అందరి ముందు నన్ను చులకన చేస్తుంది, గొడవపడుతుంది. తన అసంతృప్తిని తగ్గించడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ వృథా. నన్ను కొట్టడం కూడా అలవాటయింది. పరువు పోతుందనే భయం, పిల్లాడున్నాడనే ఆలోచన, పెద్దవాళ్లు బాధపడతారనే భావంతో ఇప్పటి వరకు అగౌరవాన్ని భరించాను. ఇక నా వలన కాదు — విడిపోవాలనుకుంటున్నాను.”
రమ్య: “మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లై 23 సంవత్సరాలు. నేనే కావాలని మా నాన్నగారిని ఒప్పించి చేసుకున్న పెళ్లి ఇది.
కానీ పెళ్లయ్యాక నా భర్త —
నేను అందంగా లేనని, ఏ పని సరిగ్గా చేయనని, పిల్లలను సరిగ్గా పెంచట్లేదని, తెలివితేటలు లేవని, పిల్లల ముందు, ఇతరుల ముందు నన్ను చులకన చేస్తారు. ఇంత బాధపడిన నేను ఆయనను గౌరవించడం భార్యగా నా ధర్మం అని ఆయనే చెబుతారు.”
సరయు: “చిన్నప్పటి నుండి మా తల్లితండ్రుల కొట్లాటలు చూస్తూ ఇంటి వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందోననే భయంలోనే నేను, చెల్లి పెరిగాం. స్కూల్‌లో ఏ సమస్య వచ్చినా మమ్మల్ని తిట్టేవారు, కొట్టేవారు.
చెల్లి తప్పు చేసినా ‘నీవే సరిగా లేని కారణంగా ఆమె అలావుతోంది’ అని నన్నే నిందించేవారు. ‘నాకు గౌరవం కావాలి, నిందించకండి’ అని అడిగినప్పుడల్లా — ‘పిల్లలు తల్లితండ్రులను గౌరవించాలి; తల్లితండ్రులు పిల్లలకు గౌరవం ఇవ్వనవసరం లేదు’ అని అనేవారు.”
సైకాలజిస్ట్ మాట
అగౌరవాన్ని సూచించే ప్రవర్తనలు:
- ఇతరులతో పోల్చి హేళన చేయడం
- తప్పులే ఎత్తి చూపడం —మెచ్చుకోలేకపోవడం. శరీరంలో, ప్రవర్తనలో లోపాలు ఎంచడం చుల్కన చేయడం.
- ప్రతి విషయంలో మారమని ఒత్తిడి చేయడం
- మనసు గాయపడేలా మాట్లాడటం, కొట్టడం, తిట్టడం
- అందరి ముందు విమర్శించడం మరియు అవమానించడం
- మన భావాలు, ఆలోచనలు, ప్రవర్తనకూ విలువ ఇవ్వకపోవడం
- తమ తప్పులు ఒప్పుకోకుండా, మనల్నే సమస్యగా చూపడం. చేతన్, రమ్యలకు సూచనలు
భార్య–భర్తలు బండికి రెండు చక్రాలు. ఒక్క చక్రం పనిచేయకపోతే బండి కదలదు. వివాహంలో గౌరవం అంటే ఏమిటో భార్య–భర్తల మధ్య చర్చించి, ఆచరించడం అత్యవసరం.
ఉదాహరణకు — “నేను పెద్దగా మాట్లాడటం నా అలవాటు, నువ్వు అలవాటు చేసుకో” అని చెప్పడం సరైనదికాదు. అది భార్య/భర్తకు బాధ కలిగిస్తే, మార్చుకోవాల్సిందే. అగౌరవాన్ని మొదటిసారి అనుభవించినప్పుడు గౌరవంగా నిలదీయాలి. ఒక్కసారి దిగమింగితే, అగౌరవం అలవాటవుతుంది. ఎదిరించడం వల్ల ఆత్మగౌరవం పెరుగుతుంది. మనల్ని ఎలా గౌరవించాలో ఇతరులకు నేర్పేది మన ప్రవర్తన. గౌరవం ఒక విలువ—దాన్ని ఆచరించాలి, బలవంతంగా నేర్పలేం. చేతన్, రమ్య — మీ జీవిత భాగస్వాములు ఈ విలువను ఆచరించనివారు. వాళ్లను మార్చలేరు. అందుకే, వాళ్లనుంచి దూరంగా ఉండటం మీ మానసిక ఆరోగ్యానికి మేలు. రమ్య మీరు దూరంగా ఉండాలంటే మీరు ఆర్థిక స్వతంత్రం మీద దృష్టి పెట్టాలి లేదా పిల్లలు ఆర్థికంగా స్థిర పడిన తరువాత వాళ్ళకి చెప్పి ఆయనికి దూరమవ్వాలి. మీరు నచ్చట్లేదు అని పదే పదే చెప్పే వాతావరణంలో ఉండడం మీ ఆత్మ గౌరవనికి మరియు మీ ఆరోగ్యానికి మంచిది కాదు.
సరయు తల్లితండ్రులకు సూచనలు…
పిల్లల ఆలోచనలు, భావాలు గౌరవించడం నిజమైన స్వేచ్ఛ. ఈ స్వేచ్చ పిల్లలికి ఇవ్వడం తల్లి తండ్రుల కర్తవ్యం. మీకు వాళ్ళ ఆలోచనలు లేదా భావాలు ఆచరించడం కష్టమైనప్పుడు గౌరవంగా “నో” చెప్పవచ్చు.
ఇది ఉన్నప్పుడు పిల్లలు తమ భావాలను మీతో పంచుకుంటారు మరియు మీ పట్ల నిజమైన గౌరవం చూపుతారు.
ఎప్పుడూ కొట్టుకునే, తిట్టుకునే తల్లితండ్రులను పిల్లలు గౌరవించలేరు. ఈ పరిస్థితి — బంధాన్ని బలహీనపరుస్తుంది, పిల్లలు చెప్పిన మాటలు వినరు, అగౌరవం నేర్చుకుంటారు, కాబట్టి… “పిల్లలు మమ్మల్ని గౌరవించాలి” అని ఆశించకండి. మీ ప్రవర్తనతో గౌరవం సంపాదించుకోవాలి అన్నది గుర్తించండి.
మైండ్ వాయిస్
గౌరవం–అగౌరవం నాణానికి రెండు వైపులు. మీ ప్రవర్తన ఏ వైపునుందో ప్రతిక్షణం గమనించండి. అగౌరవాన్ని దిగమింగవద్దు అలా చేయటం వలన అది అవతలి వారికి అలవాటవుతుంది.
——————————
Sunday Magazine- 23 Nov | 4.అత్యాశ – కథ

నరసింహపురంలోని జాలయ్య చాలా సోమరి. అతడు ఏ పని చేసేవాడు కాదు. ఒకసారి అతడు ఇంట్లోని వారి పోరు భరించలేక ఒక వలను తీసుకొని చేపలు పట్టడానికి ఒక మడుగుకు బయలుదేరాడు. ఆ మడుగు చాలా దూరంగా ఉంది. అతడు నెమ్మదిగా నడుస్తూ ఆ మడుగుకు చేరుకున్నాడు. అక్కడ ఆ మడుగు ఉన్నట్లు ఎవరికీ తెలియదు.
అందులో జాలయ్యకు చేపలు విరివిగా కనిపించాయి. అతడు ఎంతో సంతోషించి ” ఆహా!ఏమి నా అదృష్టం. ఇక్కడ మడుగు ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు. నా పంట పండింది. ఇక్కడ ఎక్కడ లేని చేపలు ఉన్నాయి. ఇవి ఎక్కడికి పోవు. మరో రోజు వీటిని పట్టుకొని పోదాం లే” అని తన సోమరితనంతో ఇంటికి ఖాళీ చేతులతో మరలి వచ్చాడు.
రెండవ రోజు కూడా వెళ్లి మళ్లీ సోమరితనంతో అలాగే చేపలు పట్టకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు . అది చూసి అతని కుటుంబ సభ్యులు అతనిని మందలించారు. వారి కోపాన్ని చూసిన జాలయ్య మూడవరోజు ఎలాగైనా చేపలు పట్టి ఇంటికి తీసుకొని రావాలని, తన కుటుంబ సభ్యుల నోరు మెదపకుండా చేయాలని అనుకున్నాడు.
మళ్లీ ఆ మడుగుకు బయలుదేరి వెళ్లి అందులోకి చూశాడు. అక్కడ ఒక్క చేప కూడా అతనికి కనిపించలేదు. అప్పుడు అతడు” అయ్యో! నా సోమరితనమే నా కొంపముంచింది. నిన్న ఈ చేపలు పట్టుకొని వెళ్ళి ఆ సంతలో అమ్మితే నాకు చాలా డబ్బు వచ్చేది. మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషించేవాళ్లు” అని అనుకొని అటువైపు చూశాడు.
అక్కడ దూరంగా కొందరు వ్యక్తులు చేపలు దొంగతనంగా బుట్టలలో పట్టుకొని పోతున్నారు. జాలయ్య వెంటనే వారి వెంబడిపడి “ఒరేయ్! దొంగలు ఆగండి. ఆగండి రా ! అవి నా చేపలు “అని పరిగెత్తాడు. వారు అతని భయానికి చేపల బుట్టలను అక్కడే పడవేసి పరిగెత్తారు. జాలయ్య సంతోషంతో వాటిని తీసుకొని సరాసరి సంతకు బయలుదేరాడు.
అక్కడ వాటిని అమ్ముటకై ఒక అపరిచిత వ్యక్తిని చూసి అతని వద్ద వాటిని పెట్టాడు. ఇంతలో మరొక అపరిచితుడు చిన్న సంచీతో అక్కడికి వచ్చి ‘ అక్కడ కొన్ని సరకులు ఉచితంగా ఇస్తున్నారు . వెంటనే వెళ్లి తెచ్చుకో!” అని తన సంచీ చూపేసరికి జాలయ్య అత్యాశతో ఆ చేపల బుట్టలను అక్కడున్న ఆ అపరిచిత వ్యక్తికి అప్పగించి ఆ డబ్బు కొరకు పరిగెత్తాడు.
అతడు తిరిగి వచ్చేసరికి తన చేపల బుట్టలు లేవు. తాను అప్పగించిన వ్యక్తి కూడా లేడు. ” ఓహో! ఈ దొంగ వెధవలు కావాలనే తనను తప్పుదారి పట్టించారు” అని అనుకొని బాధపడ్డాడు .
తన అత్యాశనే తనకు నష్టం కలిగించిందని జాలయ్య భావించి ఉస్సూరుమనుకొంటూ ఇంటికి వెళ్ళి జరిగిన సంగతిని వారికి చెప్పాడు. చేపలు పోగొట్టుకున్నప్పటికినీ జాలయ్య సోమరితనం వదిలినందుకు ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషించారు . మరుసటి రోజు నుండి జాలయ్య కష్టపడి పనిచేస్తూ సోమరితనాన్ని వీడి బ్రతికాడు.
Sunday Magazine- 23 Nov | 5.కబుర్లు – శీర్షిక

చెట్టుకు చాదస్తం జాస్తి !
చెట్టుకు చాదస్తంజాస్తి. నరికినా అవి నరజాతినిప్రేమిస్తాయి. వేరుతో సహా వూడబెరికినా తాను ఎండకు కాగుతూనీడ ఇవ్వాలనే చూడడం చెట్టుచాదస్తమా? కొమ్మలు విరుచుకు పోయే దొమ్మీజాతిని సరసకు రానీయనే కూడదు కదా వాస్తవానికి!రాళ్లేసి పళ్లు రాలగొట్టుకునే రాలుగాయిల మీద పూలు కురిపించే చెట్టును వట్టి ‘ఫూల్’ అనాలా? చెట్టు తన పట్టలు చీల్చుకు పోతున్నా పట్టించుకోదు.. సరి కదా తానే తనతొర్రలో ఆ త్రాష్టుడు పైపైకి ఎగబాకేటందుకు వీలుగా తొర్రలు తయారుచేయడం విచిత్రమే!
చెట్టంత ఎదిగిన మనిషి చెట్టుకు అపకారం తలపెట్టినా ఒక్క తిట్టు పదమైనా విసరని చాదస్తం చెట్టుజాతిది! నిలువ నీడలేని నిర్భాగ్యుడికి తనేకుదురుకడుపులో ఇంతవెచ్చని చోటిచ్చే దయామయి లోకంలో చెట్టు కాక మరొకటి కనిపిస్తుందా? దేవుడు ఉన్నాడో లేడోనని సందేహించేవాళ్ళకు.. ఉంటేగింటే ఎలా ఉంటాడోనని తర్కించేఆలోచనాపరులకు తనే దేవుడు అని చెట్టు స్వయంగా నోరు విప్పి సందేశమివ్వదు.
గొప్పగొప్ప సేవల నిశ్శబ్దంగా చేసుకుపోవడమే తరువు తత్వం తప్పించి గొప్పలు చెప్పుకునే నైజం చెట్టుకువంటబట్టలేదు. వంటచెరుకుగా తనను వాడుకొమ్మన్నది.. కొమ్మలు ఎండిన తరువాత! తిండి సరుకుగాకండలు పెంచుకొమ్మని కాయా కసరూ, పండూ, పసరూవిసుగూ విరామం లేకుండాకర్ణుని మించి ఎల్లవేళలా కొమ్మలతో అందించేది చెట్టు.
ఒక్క మనిషికనే కాదు నిజానికిచెట్టు సృష్టిలోనితతిమ్మా అన్ని జీవులకుఅమ్మను మించిన అమ్మ! అమ్మదయినా అడగనిదే పెట్టని ఔదార్యం కాదు. ఆమె అయినా ఆ చెట్టు కొమ్మ ప్రసాదంతోనే సంసారంసాకేది. వంటికి చుట్టుకునే బట్ట చెట్టు ఇస్తేనే కదా వచ్చేది! కంటికి పెట్టుకునే కాటుకైనా సరే.. కాలి బూడిద అయిన పిదప మిగిలిన మాసిక నుంచేవచ్చేదని తెలుసా!
జీవుల సేవ కోసమై నేల తల్లి కడుపున పడినప్పటి బట్టే చెట్టువిత్తనమై మొలకెత్తాలని ఎంతలా తపిస్తుందో మనిషికి తెలియదు. అదనుకు పదునుగా వానలు పడితే ఆనందంగా వేళకుపంటగా మారి మన ఇంట చేరి గోదాము గుంటలో ఓ మూల దానానికి సిద్ధంగా ఉంటుంది. ఒకసారి కరవురక్కసి రక్కేసిపోతుంది. మరోసారి వరద వచ్చి వంగడం కొట్టుకుపోతుంది.
ఇంకోసారి ఏపురుగో పుట్రో కుట్ర పన్నినట్లు తిండిగింజను తన్నుకుపోతుంది. ప్రకృతి ఉక్రోషం, ప్రకృతిఉక్రోషంతో నిమిత్తంలేని సేవాతత్వం చెట్టూచేమది.కాబట్టే తాలూ తప్పను కూడా వదలకుండా ఏ తవుడుగానో, చొప్పగానో మార్చిసాగుపశువుల కడుపు నింపేది. నమ్ముకున్న ఏ జీవినీ వదిలేసే ఊహ ఎప్పుడూ రాకపోవడంసృష్టివిచిత్రాలలోకెల్లా చెట్టు విశిష్ట లక్షణం.
అగ్గి పెట్టే వంటచెరుకు నుంచి అగ్గిపెట్టెలోమండే పుల్ల సరుకు వరకు అన్నింటా చెట్టు మహావిశ్వరూపమే.చెట్టు విశ్వంభర! చెట్టు కలపగా ఇళ్లు కడుతుంది.చెట్టుఆకులై దడులు నిలబెడుతుంది. చెట్టుదుంగలై తల కాచినప్పుడే మనిషి ఒకఇంటివాడుగా మారే అవకాశం. నిజానికి మనిషిచెట్టాపట్టాలేసుకు తిరగవలసిన స్నేహి.
అమ్మ పక్కన చేరి నసపెట్టేపసికందుకుతాను ఊయల! అన్నీ విడిచి పరలోకానికి నడిచే మనిషిప్రయాణానికి ఆఖరి మజిలీచెట్టు పేటిక. పాడు లోకం అని ఎంత ఈసడించిపోతున్నాతానే ఒక పాడెగా తోడు వచ్చే ఆత్మబంధువు కూడా చెట్టే సుమా!మట్టితో మనిషి మమేకమయే చోటుకుగుర్తుగా..తల పైకెత్తి మొలకెత్తేదిచెట్టు చిగురే!పూలు కానుకగా ఇస్తుంది సరే.. ఆపూలకు తావి కూడా ఎందుకుఇస్తుంది చెట్టు? మానవత్వం ఎంతసుగంధభరితంగా పరిమళించాలో చెట్టు సోదహరణగా ఇచ్చే సందేశంఅది! పండు ఇస్తుంది..సరే పండుకు రుచి ఎందుకు జతచేస్తుంది చెట్టు?
మనిషితత్వం ఎట్లా పండించుకొనాలో గురువులా తరువు బోధించే జీవనసూతం సుమా అది! కాలానికిసూచికలు చెట్టు ఎదుగుదలదిగుదలలు! ఏమీ మిగల్చని గ్రీష్మంవెన్నంటే వసంతంలా విచ్చి చెట్టు జీవిత పరమార్థం ప్రకటిస్తుంది. రాతికుప్పలు, ఇసుక దిబ్బలు, జలగర్భాలు.. మలకూపాలు.. ఏదీ చెట్టు చివుళ్ల పచ్చని పలకరింపుకులకుబహిష్కృతం కాదు. అడిగితే బెరడునైనా మందుకు ఇచ్చేందుకు బెట్టుచేయని చెట్టు నుంచి మనిషి ఏమి పాఠం నేర్చుకుంటున్నట్లు? కట్టుబట్ట నుంచి, కొట్టుకు తినే కాయా, కసరు వరకు దానం చేస్తూ కర్ణుడిని మించిన ఔదార్యంప్రదర్శిస్తుంది చెట్టు!
నివారణలోనే కాదు, రోగ నిదానచికిత్సలో సైతం వేరు, కాండం, మూలిక. ఆకు, పసరు, లేహ్యం, లేపనాలుగామొక్కచేసే సేవకు ఇంగితమున్న ఏ మానవుడైనా సాగిలపడి మొక్కాలి కదా నిజానికి? జ్ఞాన సింధు బుద్ధుడికి గురువయింది తరువు;కాని నేటి మనిషి మొరటుతనంతో తరువు పరువుకోలుపోతున్నది;గొడ్డలి పెట్టుకు విరిగిపడే చెట్టును చూస్తే గుండె చెరువవుతున్నది. కోరినది ఏదైనా కాదనకుండా సృష్టించి ప్రసాదించేపురాణాల కల్పన కాదు కల్పతరువు. వాస్తవజగత్తులోనూ గడ్డిపోచ నుంచి, గంధపుచెక్క దాకా మనిషి జీవితంలోని ఏ భాగమూ వృక్షజాతిప్రమేయం వినా వృద్ధిచెందే అవకాశం.
లేదు. దాల్చినచెక్కా.. పూరి జగన్నాథుడుగా మలిచిన చెక్కా.. చెట్టు దాల్చే సహస్రాధిక అవతారాలలో బిందుసమానం మాత్రమే!చెట్టుకూమనిషికీ మట్టే తల్లి. ఒకే తల్లిపేగులైపుట్టినా ఇద్దరి తత్వాల మధ్య ఎందుకింతతారతమ్యం?తన పొట్ట కొడితే తప్ప తన బతుకు గడవని చెట్టు పైనా మనిషి నిర్దాక్షిణ్యం?!సౌహార్ద్రం సంగతిఆనక.. కనీసం సోదరభావమైనా మనిషి ఎందుకు ప్రదర్శించడు?! ‘వృక్షో రక్షతి రక్షతః’ ..చాదస్తసుభాషితం కాదు. ‘చెట్టును బతకనిస్తేనేచెట్టు బతుకునిస్తుంది అనే పర్యావరణ సూత్రంఎంత సత్వరం వంటబడితే మనిషి మనుగడకు అంత శ్రేయస్కరం!
Sunday Magazine- 23 Nov | 6.రిక్షా నూకరాజు

రాజమండ్రి వై జంక్షన్ వద్ద అరుపులుముకున్నాయి.. గలాటాని గమనించి అటుగా వెడతూ ఏమైందోనని చూద్దును కదా కృష్ణమూర్తి ఎవరితోనో ఘర్షణ పడుతున్నాడు. ఇస్త్రీ చేసే బడ్డీ పక్కనే రిక్షాలు ఆగే చోటు. అక్కడ ఏదో జరిగింది. అందుకే జనం తగాదా పడుతున్నారు. ఆగండి గట్టిగా అరిచాను. నా మాటకు అందరూ నా వెంపు తిరిగి చూడండయ్యా వీరి బడ్డీ వల్ల నూకరాజు రిక్షా విరిగి పోయింది.
అతను తీవ్రంగా గాయపడ్డాడు. నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. బండాయిన ఇవ్వనంటూ ఏం చేసుకుంటారో చేసుకోమంటూ గొడవ పడుతున్నాడు. పైగా పోలీసు కేసు పెడితే మీకే ఇబ్బంది అంటున్నాడూ అని వాపోతుంటే “ఆగండి నేను మాట్లాడుతా. గొడవపడితే ఆయన అన్నట్టు బడ్డీకొట్టకు కూడ ఇబ్బంది” అన్నాను.. “నాకేమి ఇబ్బందీ” బడ్డీ కొట్టు రాముడు ధీమా ప్రదర్శించాడు.
“నీకు ఇబ్బంది ఏమిటా…మీకొట్టు ట్రాఫిక్ నింబంధనలకు విరుద్ధంగా వుంది. ఇప్పుడు గానీ నువ్వు గొడవ డితే అది మునిసిపాలిటీకి చేరుతుంది..తొలగించాలని మున్సిపల్ అధికారులు, చట్టవ్యతిరేకమైన పనిగా పోలీసులు నిర్ధారించి జరిమానా జైలు శిక్ష పడుతుంది… అందుకే ఎవరు తొందరపడకండి” అన్నాను. “నిజమా! సారూ! మీరే ఏదైన న్యాయం చేయండి నూకరాజుకు” అంటూ దారికొచ్చారు.
అక్కడ గుమికూడినోళ్ళు మొత్తానికి కృష్ణతో మాటాడి గాయపడిన నూకరాజుకు వైద్యం చేయించాలని, అతని జీవనాధారమైన రిక్షా బాగుచేయించడమో, కొత్తది కొనివ్వడమో చేయాలని సూచించగా అంగీకరించడంతో ఆ గొడవ సర్దుమణిగింది. “నూకరాజు మీద ఎందుకంతభిమానం” అని అడిగిన కృష్ణకు “గతంలో నూకరాజు మా తాతగారి కుటుంబం యెడల చూపిన కృతజ్ఞత, అభిమానం” అంటూ గతం వివరించడం మొదలెట్టా. .ఓ ఇరవై ఏళ్ళ క్రితం నూకరాజు రిక్షాతో మా తాతయ్య గారి కుటుంభానికి గల బంధం ఆ మధురానుభూతి నాకిప్పటికి గుర్తుంది.
గౌరీ పట్నం.. అది మా తాతగారి అత్తగారి ఊరు..కొవ్వూరు నుండి గౌరీ పట్నం 20 కి.మీ దూరం..ఎప్పడైనా సెలవులకో, ఏదైనా శుభాశుభకార్యాలకో వెళ్ళాలంటే నూకరాజు రిక్షాలో వెళ్ళేవాళ్ళం. తాతయ్య, అమ్మమ్మ, నేను, ఆఖరి బిడ్డ సూర్యకుమారి. నేనప్పుడు ఐదో తరగతి, కుమారి ఒకటో తరగతి. ముఖ్యంగా వేసవి సెలవులు గౌరీ పట్నంలోనే గడిపేవాళ్ళం.
ఆ ప్రయాణం చేయడానికి నూకరాజుకు కిరాయి కింద డబ్బులతో పాటు, భోజనం పెట్టించి, మళ్ళీ కొవ్వూరు వెళ్ళటానికి ఎప్పుడు రావాలో చెప్పేవారు. కుటుంబం గడుపుకోటానికి అరబస్తా బియ్యం మూట ఇచ్చే వారు..దాదాపు నాకు తెలిసి ఏడెనిమిది ఏళ్లుగా నేను గమనించిన తాతగారి ఔదార్యం అది. నూకరాజంటే ఆయనకు వల్లమాలిన అభిమానం.
వాళ్ళ నాన్న తాతగారి వద్ద పాతికేళ్ల పైగా నౌకరు ఉద్యోగం చేసాడు అతడు చనిపోతే అక్షర జ్ఞానం లేని పద్దెనిమిదేళ్ల నూకరాజును చేరదీసి బతుకు తెరువుకోసం రిక్షా కొనిచ్చిన ధర్మాత్ముడు. దానిని ఉదారంగా ఇవ్వడమే కాదు నూకరాజు రిక్షా తను వాడుకున్నందుకు కిరాయి డబ్బులు కూడ యిచ్చిన మానవతా మూర్తి. గౌరీపట్నం అంటే మాకు హుషారు…అది అమ్మమ్మ పుట్టిల్లన్నమాట. అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు లక్ష్మీ నరసింహారావు, తమ్ముడు బాల శంకరరావు, మరదలు పానకాలు, నలుగురు మేనళ్ళుళ్ళు, ఓ మేనకోడలు వుండేవారు. ఓ పెద్ద పెంకుటిల్లు..మండువా లోగిలి. .
ముందు ఎత్తు అరుగులు..రెండు వెంపుల గదులు. లోపలికి అడుగు పెడితే మండువా వున్న గది. రెండు వైపుల గదులు. గదులావల వరండాలు. దాటితే రెండు పెరడులు. ముందుకు అడుగు పెడితే రెండు వైపులా గదులు. ఒకగది అటు భోజనాల వసారాకు, వంట గదిలోకి వెడుతుంది. ఇంకో గది ఇటు వసారాలోంచి పక్కగా స్టోరు గదికి వెడుతుంది.
అక్కడ ముందు ఎదురుగా కనిపిస్తుంది. పెరుగు కుండ కవ్వంతో, వెన్న చిలికేది ఇక్కడే. తదుపరి స్టోర్ గదిలోకి.. ఇకపోతే ఇటు భోజనశాల అటు కవ్వం చిలికే చోటు ఒకే వసారాలో వుంటాయి. దాటితే కుడి వైపు బావి స్నానాల గది..ఆటువైపు మరో కొట్టుగది ఎరువులు దాచేది. నడవ దారిలోంచి దొడ్లోకి వెడితే ఆవులు, గేదెలు ఎడ్లువుండే పెద్ద పాక.
కుడి వెంపు బజారు కెళ్ళేదారి. ఎడమవైపు పెద్ద పొగాకుబేరన్, ఖాళీ జాగా నుంచి ఎడమ వెంపు తిరిగి ఇంటి పక్కకు వీధిలోకి సందు గుమ్మం…అటు బావి పక్కనుండే దారినుండి పెరడులోకి నడిస్తే ఆరు కొబ్బరి చెట్లు, రెండు బాదంచెట్లు ధాన్యంకొట్టు కాస్త ఖాళీస్థలంలో పూలమొక్కలు, కూరగాయలమొక్కలు. చివర ఎడమమూల మరుగుదొడ్లు. భౌతికవర్ణన పక్కనపెట్టితే మా సెలవులకు అక్కడ గడపటం ఎంతోఆనందం. మా అమ్మమ్మ మరదలు పానకాలు పిన్నిగా ప్రసిద్ధి.
రామలింగేశ్వర రావు అన్నయ్య , లక్ష్మీ నారాయణ(లక్ష్మణగా..) పరదేశిరాజు, లక్ష్మీ నరసింహారావు(బాబి)సుబ్బలక్ష్మితో నేను, కుమారి గుండ్రంగా కూర్చుని పిన్ని చేతి చద్దన్నం తినేవాళ్ళం. ఆవకాయ, కమ్మని నేతితో కలిపి, ముద్ద ముద్దకు వెన్న పూస రేగి పండంత కలిపి తింటుంటే… చెప్పలేని రుచి. తదుపరి గడ్డ పెరుగుతో లాగించే వాళ్ళం.
సాయంత్రం పొలం వెళ్ళి వాళ్ళ పాలేరు కొట్టిచ్చిన ముంజ కాయలు తినడం ఒక మరచి పోలేని వేసవి పలహారం. రాత్రి భోజనాలనంతరం.. కొబ్బరి చెట్ల కింద మంచాలు వేసుకుని వెన్నెల రాత్రులు కబుర్లు చెప్పుకుంటూ పడుకునే వాళ్ళం.మరునాడు మామిడి తోటలో బంగినపల్లి, కలెక్టర్ కాయలు..కోసుకుని తినే వాళ్ళం.
అలాంటి బాల్యపుటనుభవాలు.మరపు రానివి..పది రోజులు సువర్ణాక్షరాలతో లిఖించుకోవడమే. తాతయ్య గారి కబురు విని నూకరాజు వచ్చేవాడు. మేం నలుగురం రిక్షాలో తిరుగు ప్రయాణం చేసేవాళ్ళం..అంతటి ప్రయాణ మధురానుభవాల కర్త కదా నూకరాజు. ఒక్క సారి గతమంతా ఇలా సినిమా రీలులా కదలాడింది.
అనుకోకుండా కళ్ళు చెమర్చాయి…అందుకే కృష్ణని ఒప్పించి నూకరాజుకు న్యాయం చేయ గలిగాను. తర్వాత హడావుడి మామూలే…పోలీసులు రావడం విచారణ జరపాలనంటుంటే వెంటనే నేను కలగ జేసుకుని వివరంగా జరిగింది చెప్పాను.
ఇస్త్రీ బడ్డీ కొంచెం వెనక్కి జరపాలని, ట్రాఫిక్ అంతరాయం నివారించేందుకు, పక్కన రిక్షా వాళ్ళు కూడ సహకరించాలని సూచించారు..ఉల్లంఘిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించి వెళ్ళారు పోలీసులు. రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు చట్టాన్ని గౌరవించాలి, అందరూ గుర్తు పెట్టుకోండి, అని గట్టిగా హెచ్చరించి, నూకరాజును హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాడు కృష్ణ.
Sunday Magazine- 23 Nov | 7.సన్నిహితం… శీర్షిక

అహంకారం కళ్ళను కప్పేస్తే..
సూర్య కథలు వ్రాయడం ప్రయత్నిసున్నాడు. సాహిత్యం అంటే అతనికి ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుండి బోలెడన్ని కథలు నవలలు చదివాడు. క్రమంగా కథకు వ్రాయాలి అన్న కోరిక కలిగింది అతనికి. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక కథ వ్రాసాడు. అయితే ఆ కథను తన అభిమాన రచయితకు చూపించాలి , ఆయన అభిప్రాయం తెలుసుకోవాలి అని భావించాడు.
అతి కష్టం మీద ఆయన అపాయింట్ మెంట్ సంపాదించగలిగాడు. ఒక శుభముహూర్తాన ఆయన్ను కలిసి తన కథ చూపించాడు. ఆ మహా రచయిత ఆ కథ చదివి ” అబ్బే..ఏమీ బాగాలేదు ..నువ్వు బాగా కృషి చేస్తే తప్ప రచయిత వి కాలేవు ” అని నిరుత్సాహ పరిచాడు. పైగా ” ప్రతివాడికి ఈ మధ్య కథలు వ్రాయడం ఫ్యాషన్ అయిపోయింది ” అని అవహేళనగా మాట్లాడాడు.
చాలా బాధ గా ఫీల్ అయ్యాడు సూర్య. అక్కడి నుండి మౌనంగా వచ్చేశాడు. ఇంటికి వస్తుంటే తను కూడా అలా ప్రవర్తించిన సంఘటన గుర్తుకు వచ్చింది. పదో క్లాసులో మంచి మార్కులు వచ్చాయి సూర్యకు. అందరూ బాగా మెచ్చుకున్నారు. ఆ టైములో ఒకరోజు ఇంటర్ లో జాయిన్ కావడానికి జూనియర్ కాలేజీకి వెళ్ళాడు. అక్కడికి చాలా మంది విద్యార్థులు వచ్చారు. అందులో దగ్గర్లో ఉన్న పల్లెటూరు నుండి వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఒక విద్యార్థి దగ్గరకు వెళ్ళి ” నీకు ఎన్ని మార్కులు వచ్చాయి ” అని అడిగాడు సూర్య.
ఆ కుర్రాడు తనకు వచ్చిన మార్కులు చెప్పాడు. పగలబడి నవ్వాడు సూర్య. ” నా మార్కులు తిరగేస్తే నీకు వచ్చిన మార్కులు అవుతాయి. నీకు పై చదువులు కావాలా పల్లెటూరు వాడా ..” అంటూ అవహేళనగా మాట్లాడాడు సూర్య. ఆ కుర్రాడికి బాధతో అవమానంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూ కళ్ళు తుడుచుకున్నాడు. ” మా అమ్మా నాన్నకు చదువులేదు అన్నా..ఈ మాత్రం చదవడం గొప్పే కదా ” అన్నాడు.
” అవునులే .. అంతే” అంటూ నవ్వాడు సూర్య. ఆ సంఘటన గుర్తు వచ్చినప్పుడల్లా చాలా బాధపడతాడు సూర్య. అనవసరంగా తన అహంకారంతో ఒక కుర్రాడి మనసు బాధ పెట్టాను అని పశ్చాత్తాపం ఫీల్ అవుతాడు. ఆ ప్రవర్తనకు కారణం అహంకారమే కదా అని అనుకుంటాడు. ఇప్పుడు ఆ పెద్ద రచయిత కూడా తనని చులకనగా మాట్లాడటానికి కారణం కూడా అహంకారమే కదా. ఆ అహంకారం లేని రోజున మానవ సంబంధాలు బాగుంటాయి కదా అని నవ్వుకున్నాడు సూర్య .
Sunday Magazine- 23 Nov | 8.ఇదీ వరస

Sunday Magazine- 23 Nov | 9.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

ఎవరి వెర్రి వారికానందం!
‘వెర్రి’అంటే పిచ్చి. అది ఆనందం ఎలా అవుతుంది? అవుతుంది. అది సొంత వెర్రి అయితే అదే ఆనందం అవుతుంది. మానవుని బలహీనతలలో అతి ముఖ్యమైన దాన్ని వ్యంగ్యంగా వేలెత్తి చూపే సామెత ఇది. ఒక్కొక్కరికి ఒక్కో Pet topic ఉంటుంది. ఒక్క నాయకుడు లేదా సినిమా నటుడి మీద వీరాభిమానం ఉంటుంది. కాని అది వేరే వాళ్లకు ‘వెర్రి’గా కనిపిస్తుంది కాని వారికి ఆనందమే.
నా కథాసంపుటి ‘దత్తకథాలహరి’ఆవిష్కరణ కొన్నేళ్ల క్రిందట రవీంద్ర భారతిలో జరిగింది. సమీక్ష కోసం ఒక విమర్శకుని ఆహ్వనించాము. ఆయనకు Pet topic ‘మాతృభాషాదినోత్సవం’. ఆయన నా కథలు ఎలా ఉన్నాయనేది వదిలివేసి, మాతృభాష గొప్పదనాన్ని గురించి, దాన్ని అమలుచేయడంతో పభుత్వాల నిర్లక్ష్యం గురించి సుదీర్ఘ గంభీరోపన్యాసం చేసి “తెలుగును కాపాడుకుందాం!” అని నినదించి ముగించాడు. తెలుగు గొప్పదే, కాదని ఎవరన్నారు? దానికి సమయం సందర్భం అక్కరలేదా? చెప్పండి. చాలా పెద్దాయన. ఏమంటాం? ఆయన వెర్రి ఆయనకు ఆనందం.
మా కజిన్ ఒకతనుండేవాడు. వంట చేయడంతో ఎక్స్‌పర్ట్. మంచిదే. వెరీ గుడ్. అతడు పెళ్లిచూపులకు తల్లిదండ్రులతో వెళుతూ, నన్ను పిలిచాడు “దత్తన్నా నీవూ రా” అని. అక్కడ అమ్మాయిని తీసుకురావడానికి ముందు ఫలహారాలు (ఫలాహారాలు అనాలేమో? అందులో ఫలాలే లేవు!) తెచ్చిపెట్టారు. క్యారెట్ హల్వా, అరటికాయ బజ్జీలు. మావాడు ఇక తన ఆనందాన్ని (అదేనండి ‘వెర్రి’ని) ప్రదర్శించడం ప్రారంభించాడు. క్యారెట్ హల్వా ఇంకొంచెం ముదురు పాకం చేయాల్సిందన్నాడు. బజ్జీల పిండిలో వంట సోడా తక్కువవడం వల్ల అవి క్రిస్పీగా రాలేదన్నాడు. ఆ అమ్మాయి వీడి ధోరణి చూచి బెంబేలుపడింది. వాళ్ల పెళ్లయిందనుకోండి, వాడు స్ఫూర్తిగా ఒక కథ వ్రాశాను. దాని పేరు ‘వంటొచ్చిన మొగుడు!’.
ఇంగ్లీషులో దీనికి సమాంతరమైన సామెత ఉందండోయ్! ‘Everyone’s folly is pleasure to himself’. మనం ‘వెర్రి’అన్నాం, వాళ్ళు మూర్ఖత్వం అన్నారు. అంతే తేడా! ఈ సామెత ‘ఆంధ్రలోకోక్తి చంద్రిక’ (1868) లో కనిపిస్తుంది. ‘బంధాలు అనుబంధాలు’అన్న సినిమా (1982)లో ఇదే సామెతను పల్లవిగా ‘రాజశ్రీ’గారు ఒక హాస్యస్ఫోరకమైన పాట రాశారు. దానిని కె.వి మహదేవన్ గారు స్వరపరచగా, మాధవపెద్ది రమేష్, రమోలా గార్లు పాడారు. ఈ పాటలో రకరకాల ‘పిచ్చి’లను (పిచ్చులను?) రాజశ్రీ గారు పేర్కొన్నారు.
ఈ వెర్రి కొందరికి వేపకాయంత ఉంటుంది. పరవాలేదు. దీన్ని భరించవచ్చు. కొందరికి తాటికాయంత, మరికొందరికి పనసకాయంత ఉంటుంది. వీళ్లను భరించడం కష్టం మాస్టారు! వారి ‘ఆనందం’లో వారుంటే నో ప్రాబ్లం. దానిలోకి మనల్ను కూడా రమ్మంటేనే చిక్కు. బెంగుళూరులో ఎన్.టి.ఆర్. శతజయంతి ఉత్సవాలు జరిగాయి.
నన్ను పిలిచారు, వెళ్లాను. తృణధాన్యాల గొప్పదనం గురించి అదేపనిగా వీడియోలు చేసి యాట్యూబ్‌లో పెట్టి, ఉరూరా వాటి గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఒకాయనను (ఆయన ‘పద్మశ్రీ’కూడానండోయ్!) ఒక అతిథిగా ఆహ్వానించారు. ఆయన మైకు తీసుకొని “ఎన్.టి.ఆర్. సినిమాలు నేను అంతగా చూడలేదు. ‘లవకుశ’చూసినట్లు గుర్తు.” అని మొదలుపెట్టి, “ఆడపిల్లలు చిన్నవయస్సులోనే రజస్వల ఎందుకవుతారు?అరికెలు, సామలు, సజ్జలు, జొన్నలు…” అంటూ ఊదరకొడుతున్నాడు. విధి లేక నిర్వాహకుడొకరు వెళ్ళి ఆయన చెవిలో ఏదో చెప్పాడు. ఆయన ప్రసంగం ఆపేశాడు. (ఇంతకూ ఏమి చెప్పి ఉంటాడంటారు?)
ఒకేసారి మన వెర్రి మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడయినా జాగ్రత్తపడి, దాన్ని ఇతరుల మీదకు ఒంపేయకుండా వుండాలి. ఆ వెర్రినే మనం కాలక్రమాన మన మేధస్సుగా భావించే ప్రమాదం ఉంది. ‘విలియమ్ బ్లేక్’అనే కవిఇలా అంటాడు:
“The Fool who persists in his folly will become wise.”
“తన వెర్రి లోనే ఉండి, అదే గొప్ప అనుకునేవాడు మేధావి అవుతాడు!”
‘అని అనుకుంటాడు’అంటే సరిపోయేది. తర్వాత తెలుస్తుంది, అదంతా వెర్రి అని! అందుకేనేమో ‘Mark’అని ఒకాయన ఇలా చమత్కరించాడు!
“Life is best lived at the edge of folly”. మనది వెర్రి అని తెలిసిన తర్వాత బాగా బతుకుతామట!!
ఇంకో సామెతతో వచ్చేవారం కలుద్దాం!
Sunday Magazine- 23 Nov | 10.పుస్తక సమీక్ష

సమీక్షకురాలు : ఎన్.లహరి
కవిసంగమం ప్రచురణలు
పేజీలు : 166
వెల : 180
జాబేర్ పాషా తొలి కవితా సంపుటి “అగరు ధూపం ఊదు పొగ”.
ఈ కాలపు మనుషుల మనోభావాల్ని, సామాజిక అసమానతల్ని మానవత్వంతో తడిమి నిలువుటద్దంలో చూపిస్తుంది.మరుగున పడిన జీవితకాలపు వాస్తవాలను వెతికి తవ్వితీస్తుంది. ఇందులో ఆవేశం కంటే, ఆలోచనే కేంద్రబిందువుగా కనిపిస్తుంది.
సగటు ముస్లింలు ఎదుర్కొంటున్న ద్వేషపూరిత వాతావరణాన్ని, అందులో తొంగిచూస్తున్న భయాల్ని, అనిశ్చిత పరిస్థితుల్ని నిలువెల్లా ప్రతిబింబిస్తుంది. ప్రేమతో కూడిన సహజీవనంపై కవికి ఉన్న విశ్వాసమే ఈ కవితాసంపుటికి పునాది.
“ద్వేషానికి నానార్ధాలు వెతికింది చాలుఇక ప్రేమకు పర్యాయపదమై బతుకుదాం” అని చెప్పడంలోనే పాషా కవిత్వపు తాత్విక అంతర్మూలాలు నర్మగర్భంగా బయట పడతాయి. జాతి, మతం పేర్లతో మనసులుగా విభజింపబడుతున్న ఈనాటి సామాజిక కాలంలో జాబేర్ తన పదాలతో మళ్లీ “మనం” అనే ఉమ్మడి భావనను సామూహికంగా మేల్కొలుపుతాడు. హిందూ సోదరుడికి స్నేహహస్తం చాపుతూ, మానవత్వమే అసలుసిసలైన మతమని గుర్తు చేస్తాడు.
షాషా కవిత్వంలో ఆగ్రహ ప్రకటన లేదు. అంతకంటే బలమైన లోచూపు తాత్త్విక భావన ఉంది. లోతైన విషయావగాహన ఉంది. నేర్చుకోవాలి అనేకవితలో “కోడిపిల్లలా మారి తప్పించుకున్నంత కాలం బ్రతుకు వేట కుక్కయి తరుమూతూనే ఉంటుంది, చిక్కి మరణించడం కాదు, తెగించి ప్రతిఘటించడం నేర్చుకోవాలి” అంటాడు…
వలస జీవితాల కవితలు ఈ సంపుటిలో హృదయాన్ని మెలిపెట్టి తాకుతాయి. ‘సిద్ధిపేట్ టు మస్కట్ వయా హైదరాబాద్ ’ “అమ్మీజాన్’ ‘పంచరంగుల పంజరం’, ‘యాది’ ‘వలస శవం’ లాంటి కవితల్లో పరాయి దేశం బతుకు బాధల్ని, స్వదేశంలోని జ్ఞాపకాల మంటను కవి తన మృదువైన పదాలతో స్పృశించి దహించివేస్తాడు.
తల్లి, తండ్రి, మేనకోడలు, తెలంగాణ, ప్రేమ, ప్రకృతి, సామాజిక వ్యథలు, కరోనా కాలపు వేదనలు, వలస బ్రతుకుల గాధలు, ఇలా అనేక కవితలు ఈ సంపుటిలో శూన్యంలో పొగలా నెమ్మదిగా వ్యాపిస్తాయి. పాషా తన కవిత్వంలో తాత్త్విక భూమికను, మానవత్వాన్ని కలిపి పేని పడుగు పేకలుగా పరుస్తాడు.
“అగరు ధూపం ఊదు పొగ” సంపుటిలోని ప్రతి కవిత మనలో మానవీయ కోణ వెలుతుర్ని అంతర్లీనంగా రగిలిస్తుంది. చీలిక నుంచి వేరు చేసి మనుషుల మనసుల్ని ఏకం చేయాలన్న తపన, తాపత్రయం ఈ సంపుటి గుండె చప్పుడుగా వినిపిస్తుంది.
Sunday Magazine 23 Nov | 11.వినరో భాగ్యము – శీర్షిక

తిరుమలేశుని వివాహ ఋణం
అలిగి వైకుంఠం వీడిన లక్ష్మీదేవి కోసం శేషాచలంపై అడుగు పెట్టిన శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లి చేసుకోవడం కోసం కుబేరుడి వద్ద అప్పు తీసుకున్న విషయం తెలిసిందే. వేంకటేశ్వర మహాత్మ్యంలోని 9వ విభాగం 120-125 శ్లోకాల్లో వున్న ఆ వివరాల ప్రకారం విళంబి నామ సంవత్సరం వైశాఖమానం శుక్ల పక్ష సప్తమి రోజున కుబేరుని నుంచి 16 లక్షల రామ వరహాలు రుణంగా తీసుకున్నారు.
ఆపై మూడురోజుల తర్వాత పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం జరిగింది. ఈ రుణ స్వీకరణ సందర్భంగా రాసుకున్న పత్రంపై బ్రహ్మ, మహేశ్వరుడు, వృక్షరాజైన అశ్వర్ధుడు సాక్షి సంతకాలు చేసారు. ఆ రుణ పత్ర ఫలకం ఇప్పటికీ శ్రీవారి కోనేటి ఒడ్డున ఉన్న వరాహ స్వామి మూలవిగ్రహం వెనుక ఉందని తెలుస్తోంది.
మరిన్ని తిరుమల విశేషాలతో మళ్ళీ వచ్చేవారం Sunday Magazineతో కలుద్దాం.
12.చెప్పుకోండి చూద్దాం సమాధానాలు
జవాబు : నదియా-నయనతార
మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

