Suicide – రుణ భారంతో ఆగిన ఇద్దరు రైతుల ఊపిరి…
హైదరాబాద్ , ఆంధ్రప్రభః అప్పుల బాధ భరించలేక ఇద్దరు మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలంలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం పైడిపల్లిలో నివాసముండే పసుల మొగిలి, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం హుమ్లాతండాకు చెందిన బానోత్ బాలకిషన్ అప్పు చేసి మరీ మిర్చి పంట వేసారు. సరైన దిగుబడి రాకపోవడంతో అప్పు తీర్చలేక తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ విషయం తెలియడంతో ఇరువురి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.