ధూమ్‌ధామ్‌గా రాష్ట్ర యువజనోత్సవాలు..

  • డిసెంబర్ 18–20 యువ–2025
  • ‘యూత్ ఫర్ స్వర్ణాంధ్ర’
  • రాష్ట్ర యువజనోత్సవాలకు కౌంట్‌డౌన్
  • యువతలో నైపుణ్యాలు వెలికితీయడమే ప్రధాన లక్ష్యం..
  • యువజన సేవల శాఖ కమిషనర్ భరణి..

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో: యువతలో నిక్షిప్తమైన ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం యువ–2025 ప్రధాన లక్ష్యమని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్. భరణి తెలిపారు. గురువారం స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉన్న SHAP ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

కమిషనర్ భరణి మాట్లాడుతూ…. డిసెంబర్ 18, 19, 20 తేదీలలో గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర యువజనోత్సవాలను “యూత్ ఫర్ స్వర్ణాంధ్ర” థీమ్‌తో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ థీమ్ యువత ఆలోచనలు, సృజనాత్మకత, సామాజిక భాగస్వామ్యం రాష్ట్ర అభివృద్ధికి ఎంత ముఖ్యమో సూచిస్తుందన్నారు.

ప్రతి సంవత్సరం జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో మొదటి బహుమతి పొందిన వారిని రాష్ట్రస్థాయికి, అక్కడ విజేతలను ఢిల్లీలో జరిగే జాతీయ యువజనోత్సవాలకు ఎంపిక చేసి పంపడం జరుగుతుందని వివరించారు.

700 మంది యువత పాల్గొననున్నారు

15–29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత కోసం రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 26 జిల్లాల నుండి దాదాపు 700 మంది యువత పాల్గొననున్నట్లు అంచనా వేశామని తెలిపారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జానపద నృత్యం, జానపద గేయాలు, పెయింటింగ్, ప్రకటన రూపకల్పన, కవితా రచన, కథా రచన, ఆవిష్కరణ (సైన్స్ ప్రదర్శన) వంటి 7 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి సాధించిన యువతను జాతీయ యువజనోత్సవం–2026కు పంపిస్తామన్నారు.

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో యువత పాత్ర కీలకం

యువత స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యం సాధనలో, వికసిత్ భారత్ నిర్మాణంలో ఇంటెలెక్చువల్ వారియర్స్ గా ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, క్రీడలు–యువజన సేవల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారని కమిషనర్ భరణి తెలిపారు. తరువాత యువజన మహోత్సవం యువ–2025 కర్టెన్ రైజర్‌ను విడుదల చేశారు. సమావేశంలో AP యూత్ సర్వీసెస్ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్–కృష్ణా జిల్లాల సీఈవో యు. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply