కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం..

కూటమి ప్రభుత్వంలో పేదలకు తక్షణ వైద్య సహాయం..
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
- 23 మందికి రూ.40.68 లక్షల ఎల్ఓసీలు మంజూరు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మండలంలోని మూలపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం రిలీఫ్ ఫండ్) నుంచి మంజూరైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)లను మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 13 నుంచి 31వ తేదీ వరకు పంపిన అర్జీలకు గాను 23 మందికి రూ.40,68,061ల విలువైన ఎల్ఓసీలు మంజూరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక సవాళ్ల మధ్య కూడా కూటమి ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన, సామాన్య వర్గాల పట్ల తన బాధ్యతను విస్మరించకుండా, వారికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి నారా లోకేష్ కు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలకు సకాలంలో ఎల్ఓసీలు అందడం వల్ల వారికి తక్షణమే వైద్య సేవలు లభించి, జీవితంలో కొత్త వెలుగులు నింపుతున్నాయని లబ్ధిదారులు భావోద్వేగంతో తెలిపారు. జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్ చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

