ఘ‌నంగా అక్కమహాదేవి జయంతి వేడుకలు…

ఘ‌నంగా అక్కమహాదేవి జయంతి వేడుకలు…

నంబడే బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన అక్కమహాదేవి జయంతి ఉత్సవం చైత్రపౌర్ణమి సందర్భంగా బుధవారం సంప్రదాయబద్దంగా నిర్వహించ బడుతుందని కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ జయంత్యోత్సవము నందు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవివారికి అభిషేకం, విశేషార్చనలు జరిపించబడుతాయన్నారు.

కాగా 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణులుగా ప్రసిద్ది పొందిన మహాభక్తులలో అక్కమహాదేవి ఒకరు. వీరవిరాగిణిగా పేరొందిన అక్కమహాదేవి శ్రీశైలమల్లికార్జునస్వామివారిని తమ జీవిత భాగస్వామిగా భావించి తరించింది. శ్రీశైల మల్లికార్జునుడిపై ఎన్నో వచనాలను చెప్పిన అక్కమహాదేవి సంస్కృత, కన్నడ భాషలలో ఎంతో ప్రవీణురాలని చెప్పబడుతోంది. కన్నడ వచన సారస్వతంలో ఈమెను విశిష్ట వచనా రచయిత్రిగా సాహితీవేత్తలు పేర్కొంటారు.

ఇప్పటికీ అక్కమహాదేవి వచనాలు శివశరణాలనే పేరుతో ఎంతో ప్రచారంలో ఉన్నాయి. ఈ వచనాలలో మధుర భక్తే కాకుండా జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నో అంశాలు కనిపిస్తాయి. శ్రీశైల మల్లికార్జునునిలో ఐక్యం కావాలనే చిరకాల వాంఛ గల అక్కమహాదేవి తన జీవితపు చివరి రోజులను శ్రీశైలంలోనే గడిపింది. ప్రస్తుతం అక్కమహాదేవి గుహలుగా పిలువబడుతున్న ఇక్కడి గుహలలో కొంత కాలం తపస్సు చేసిన ఈ సాధకురాలు ఇక్కడి కదళీవనంలో మరికొంత కాలం తపస్సు చేసి, ఈ కదళీవనంలోనే సిద్ధి పొందిందని చెప్పబడుతోందన్నారు.

అక్కమహాదేవిజయంతిని పురస్కరించుకుని బుధవారం సాయంకాలం నిత్యకళారాధన వేదికపై అక్కమహాదేవి జీవిత విశేషాలపై ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేయబడిందన్నారు. భక్తులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేద పండితులు పేర్కొన్నారు.

Leave a Reply