SLBC – 17వ రోజుకి చేరిన రెస్క్యూ ఆప‌రేష‌న్ … న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

అమ్రాబాద్ – శ్రీశైలం ఎడమ కాలువ ప్రాజెక్టు ట‌న్నెల్ కూలిన ప్ర‌మాదంలో చేప‌ట్టిన రెస్క్యూ ఆపరేషన్ నేటికి 17వ రోజుకు చేరుకుంది. ఈ ప్రాజెక్టులో టన్నెల్ నిర్మాణ సమయంలో జరిగిన విషాద ఘటనతో 8 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టన్నెల్‌లో గౌరావ్ పెనిట్రేటింగ్ రాడార్ , క్యాడవర్ డాగ్స్ సాయంతో తవ్వకాలు కొనసాగుతున్నాయి. రాడార్, శునకాలు గుర్తించిన ప్రదేశాలను డీ1, డీ2, డీ3 ప్రాంతాలుగా విభజించి అక్కడ తవ్వకాలు చేపట్టారు అధికారులు.

ప్రస్తుతం డీ1, డీ3 ప్రాంతాల్లో 8 అడుగుల లోతు వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇనుప ప్లేట్లు, రాడ్స్ అడ్డుగా ఉండటంతో ప్లాస్మా కట్టర్ల సాయంతో వాటిని కత్తిరిస్తున్నారు. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డుపడుతున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ కట్టింగ్, నీటి తొలగింపు (డీ వాటరింగ్) పనులు కూడా నిరంతరం జరుగుతున్నాయి. కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంతమాత్రం అలసిపోకుండా, బృందాలు ఎప్పటికప్పుడు తమపనిని చురుకుగా కొనసాగిస్తున్నారు.

టన్నెల్‌లో మృతదేహం లభ్యం

ఇక ఆదివారం నాడు ట‌న్నెల్ నుంచి ఒక మృత‌దేహాన్ని వెలికి తీశారు. టన్నెల్‌లో కుళ్లిన స్థితిలో గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం అయింది. ఆ మృత‌దేహాన్ని పోస్ట్ మార్ట‌మ్ కు త‌ర‌లించారు.. నేడు ఆ బౌతిక కాయాన్ని బంధువుల‌కు అప్ప‌గించ‌నున్నారు అధికారులు. కాగా, మృతదేహం లభ్యం అయిన తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.. అలాగే
రూ.25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు . న‌ష్ట‌ప‌రిహ‌ర చెక్కును బాధిత కుటుంబానికి అంద‌జేశారు.

కోటి రూపాయిలు న‌ష్ట ప‌రిహారం – కెటిఆర్ డిమాండ్

ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన సంఘటనలో 16 రోజుల నిరీక్షణ తరువాత ఒక మృతదేహం లభించడం అత్యంత బాధాకరం గా ఉందన్నారు బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ . వెలికితీసిన మృతదేహం మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న పంజాబ్ వాసి గురుప్రీత్ సింగ్ కు చెందినదిగా అంచనా వేసిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఫల్యం, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని ఆరోపించిన ఆయ‌న మృతుల కుటుంబాల‌కు చెరో 50 లక్షల చెప్పున కోటి రూపాయల పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు .

మ‌రో రెండు మృత‌దేహాలు గుర్తింపు….

నిన్న తొలి మృతదేహాన్ని వెలికి తీసిన రెస్క్యూ టీమ్, నేడు మరో రెండు మృతదేహాలను గుర్తించింది. తొలి మృతదేహాన్ని టన్నెల్ బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది గా గుర్తించారు. అతడి మృతదేహం లభించిన చోటే, మరో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ఈ రెండు మృతదేహాలను నేడు వెలికితీయనున్నారు. దీనికోసం వేగవంతంగా ప‌నులు కొన‌సాగిస్తున్నారు..ఇక
కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తీసుకువచ్చిన తర్వాత సహాయకచర్యల్లో పురోగతి కనిపించింది. కేరళ పోలీస్ విభాగానికి చెందిన ఈ జాగిలాలు మట్టిలో 15 అడుగుల కింద ఉన్న మృతదేహాల ఆనవాళ్లను కూడా పసిగట్టగలవు. ఇప్ప‌టికే మూడు మృత‌దేహాల‌ను గుర్తించిన ఈ శున‌కాలు మ‌రో అయిదు మృత‌దేహాల ఆన‌వాళ్ల కోసం ట‌న్నెల్ లో వెతుకుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *