సింగరేణి ప్రత్యేక పెవిలియన్ !!
- రామగుండం ఓపెన్ కాస్ట్ లో
- లభ్యమైన స్టెగోడాన్ రకం దంతాలు
- బిర్లా సైన్స్ మ్యూజియంలో
- ప్రారంభించిన చైర్మన్ బలరాం నాయక్
గోదావరిఖని (ఆంధ్రప్రభ) : సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ తవ్వకాల్లో బయటపడ్డ లక్షల సంవత్సరాల నాటి స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాల అవశేషాలు, డైనోసార్ కాలానికి చెందిన శిలాజ కలపను కంపెనీ యాజమాన్యం మ్యూజియంలో భద్రపరిచింది. లక్షల సంవత్సరాల క్రితం కు చెందిన ఏనుగు దంతాల అవశేషాలను బిర్లా సైన్స్ మ్యూజియంలో పొందుపరుస్తూ ఇందుకోసం సింగరేణి సంస్థ ప్రత్యేక పెవిలియన్ ను ప్రారంభించింది.
ఈ మేరకు శనివారం హైదరాబాదులోని బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రత్యేక పెవిలియన్ ను సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ , బిర్లా పురావస్తు ఖగోళ వైజ్ఞానిక సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి నిర్మల బిర్లా తో కలిసి ప్రారంభించారు.
నాలుగేళ్ల క్రితం పెద్దపల్లి జిల్లా రామగుండం-1 ఏరియాలోనీ సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్టు గని లో మైనింగ్ కార్యకలాపాలు జరుపుతున్న సందర్భంగా రెండు భారీ ఏనుగు దంతాలు, దవడ ఎముకలు శిలాజ రూపంలో లభ్యమయ్యాయని సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
ఇది గోదావరి పరివాహక ప్రాంతంలో 110 లక్షల సంవత్సరాల క్రితం సంచరించిన అనంతరం అంతరించిపోయిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు అవశేషాలుగా శాస్త్రజ్ఞులు గుర్తించారని, చరిత్ర పూర్వ యుగానికి చెందిన ఈ అవశేషాలను ప్రజలు, విద్యార్థులు వీక్షించడానికి అనువుగా ప్రతిష్టాత్మకమైన బిర్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
ప్రాచీన కాలంనాటి అవశేషాలతో నాటి చరిత్రను, ఖగోళ, భూగోళ పరిశోధనలు, ఆవిష్కరణలు మొదలైన వాటితో సమాజంలో, విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు, దృక్పథాన్ని కల్పించడం చాలా గొప్ప విషయమని, ఈ సంస్థ అభివృద్ధికి సహకరిస్తున్న ఇస్రో, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా, వంటి సంస్థల సరసన తాము కూడా చేరడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
నాటి ఏనుగు దంతాలు ఎలా దొరికాయి అంటే….
రామగుండం-1 ఏరియా పరిధిలో గోదావరి నదికి పక్కన నాలుగేళ్ల క్రితం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని క్వారీ తవ్వుతున్న సందర్భంగా పొడుగాటి కొమ్ముల మాదిరిగా ఉన్న నాలుగు శిలాజాలను గుర్తించారు. ఇవి పాతకాలం నాటి జంతు అవశేషాలుగా భావించి ఉద్యోగులు యాజమాన్యానికి తెలియజేశారు.
యాజమాన్యం వారు వీటిని పరిశోధకులకు చూపించగా ఇవి సుమారు 110 లక్షల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో జీవించి, 6000 సంవత్సరాల క్రితం భూమి నుంచి అంతరించిపోయిన స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలు అని గుర్తించారు.
సాధారణంగా ఇప్పటి ఏనుగు దంతాలు రెండు లేదా మూడు అడుగుల పొడవు మాత్రమే ఉంటుండగా, నాటి ఏనుగు దంతాలు సుమారు 12 అడుగుల పొడవు వరకు ఉండేవని, ఏనుగు 13 అడుగుల ఎత్తు, 12.5 టన్నుల బరువు కలిగి ఉండేదని తెలిపారు.
ఈ స్టెగోడాన్ జాతి ఏనుగుల అవశేషాలు గతంలో నర్మదా నది ఉపనది ప్రాంతంలోనూ, ప్రపంచంలో నాలుగైదు ప్రదేశాల్లో మాత్రమే లభించాయి. సింగరేణిలో లభ్యమైన స్టెగోడాన్ జాతి ఏనుగు దంతాలలో ఒక జత దంతాలను బిర్లా మ్యూజియం వారికి తాజాగా అందజేయగా, మరొక జత దంతాలను నెహ్రూ జూలాజికల్ పార్క్ వారికి గతంలోనే సింగరేణి యాజమాన్యం అందజేసింది.


