Simhachalam Tragedy | ఒకే కుటుంబానికి చెందిన‌ న‌లుగురు దుర్మరణం

సింహ‌చ‌లం – సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో ఈ తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన దుర్ఘటనలో విశాఖపట్నానికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విచారాన్ని నింపింది. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. కాగా వారి కుటుంబంలోని మృతురాలి శైలజ తల్లి పైలా వెంకట ర‌త్నం, .. మేనత్త గుజ్జారి మహాలక్ష్మికూడా ఈ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణించారు.. వీరు ఇసుక తోట ప్రాంతానికి చెందిన వార‌ని పోలీసులు వెల్ల‌డించారు.

అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోం) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల కూడా గోడ కూలిన శిధిలాల కింద ప‌డి దుర్మ‌ర‌ణం చెందారు.

ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply