- అగ్రనేత సురవరం
- అస్తమయం
- ఆదివారం
- తుది రెడ్ శాల్యూట్
ఆంధ్రప్రభ, హైదరాబాద్ (గచ్చిబౌలి) : కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (Suravaram SudhakarReddy) (83) ఇకలేరు. తెలంగాణలోని హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ (Hyderabad) లోని మణికొండలో నివసిస్తున్న ఆయనకు భార్య డాక్టర్ బీవీ విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు.
విద్యార్థి దశ నుంచే…
విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా సురవరం సుధాకర రెడ్డి ఎదిగారు. మూడు దఫాలు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేతగా నిలిచారు. ఆయన కంటే ముందు చండ్ర రాజేశ్వరరావు (Chandra Rajeshwara Rao) సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ఉద్యమాలకు ఊపిర్లు ఊదిన సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి నేతగా ఆయన ఏఐఎస్ఎఫ్ ఎర్రజెండా పట్టుకున్నారు.
జీవిత ప్రస్థానం
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar District) కొండ్రావుపల్లెలో 1942 మార్చి 25వ తేదీన ఆయన జన్మించారు. సీపీఐ విద్యార్థి, యువజన విభాగాలకు నాయకత్వం వహించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (CPI State Secretary)గా ఆ తర్వాత జాతీయ కార్యదర్శిగా విశేష సేవలు అందించారు.
వామపక్షభావాలే ఊపిరిగా…
వామపక్ష ఉద్యమాల (Left-wing movements) ను సురవరం సుధాకర్ రెడ్డి ఊపిరి ఊదారు. ఈ పాలమూరు బిడ్డే , నల్లగొండ నుంచి 1998, 2004 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2012 నుంచి 2019 వరకు సురవరం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమాలలో సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడుగా గుర్తింపు పొందారు.
తండ్రిబాటలో… ఆయనే స్ఫూర్తిగా…
సుధాకర్ రెడ్డి తండ్రి వెంకటరామిరెడ్డి కూడా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. సురవరం తండ్రి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నారు.