లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, ఫలితాలు వెల్లడించడం నేరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు . గర్భస్థ పూర్వ, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించగా కలెక్టర్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపిల్లల జననాలు తక్కువ నమోదవుతున్న మండలాల్లో స్కానింగ్ సెంటర్లపై మరింత పర్యవేక్షణ చేస్తూ,ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

ప్రతి స్కానింగ్ సెంటర్ ఫారం ఎఫ్ తప్పకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల బాలికలు ఇద్దరూ సమానమేనని, ఆడపిల్లలు పుట్టడం ఒక వరమని ప్రతి ఒక్కరూ గ్రహించాలని చెప్పారు.

పి.సి అండ్ పి.ఎన్.డి.టి చట్టం పై అవగాహన కల్పించండి…

జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రెటరీ సీనియర్ సివిల్ జడ్జి హరిబాబుమాట్లాడుతూ జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో ఈ చట్టం పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అన్ లైన్ డిపార్ట్మెంట్ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోమని ఎవరైనా బలవంతం చేసినా, ఆడపిల్ల పుట్టిందని వివక్షకు గురిచేసిన వారు డి ఎల్ ఎస్ ఎ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు ఫోన్ చేస్తే వారికి న్యాయ సహాయము సలహా అంజేయబడుతుందని తెలిపారు.

డి ఎం హెచ్ ఓ కె . అనిత మాట్లాడుతూ, జిల్లాలో 138 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 29 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నట్లు తెలిపారు. స్కానింగ్ కేంద్రాలలో అన్నిచోట్ల జరుగుతున్న ప్రక్రియను పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరిగా అమలుజరుగుచున్నట్లు తెలిపారు. ఈ చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్థారణ పరీక్షలు చేస్తే చట్టపరంగా చర్యలు ,3 నుండి 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని వివరించారు. అవగాహన లేమి కూడా మహిళ , పురుష జనాభా నిష్పత్తిలో పెద్ద ఎత్తున తేడాలు రావడానికి కారణమన్నారు. డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు భాగస్వాములు చేస్తున్నట్లు తెలిపారు.

ఎయిడ్స్ పై..

అనంతరం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. హెచ్ ఐ వి నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ గ్రూపులు తరచు పరీక్షలు నిర్వహిస్తూ ముందస్తు నివారణా చర్యల్లో భాగంగా వారికి అవగాహన కల్పించాలని, ప్రచార కార్యక్రమాలైన జానపద కళాజాతలు, వివిధ ప్రచార కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ ఆదేశించారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, జిల్లాలో హెచ్ఐవి సోకిన వారికి చికిత్స కొరకు మూడు ఏంటి రిట్రో వైరల్ థెరఫీ సెంటర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు . అదే విధంగా 13 రక్త నిల్వ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష పాటిస్తే జిల్లాలోని మూడు ఏ.ఆర్.టి సెంటర్లు లో గల ఫిర్యాదు బాక్సులలో తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు .

ఈ సమావేశంలో అదనపు డిఎంహెచ్వో టి. శ్రీకాంత్, డిప్యూటి డి ఎం ఎచ్ ఓ మేరీ కేథరిన్, డిఐఓ రామదాసు, వైద్యాధికారులు,వివిధ ఎన్జీవో సంఘాల ప్రతినిధులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply