Minister |సత్య సాయి మార్గం ఆచరణీయం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : భగవాన్ సత్యసాయి బాబా ఆచరించి, చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.

సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డులో ఉన్న పెద్ద మందిరంలో మందిరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీఓ ప్రత్యూష బాబా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బాబాకు కేంద్రమంత్రి, కలెక్టర్ హారతి ఇచ్చారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ, సత్యసాయి బాబా బతికుండగా తాను పుట్టపర్తి వెళ్లలేకపోయాను అనే బాధ కొంతమేరకు ఉండేదని, అయితే కేంద్ర మంత్రిగా రెండు రోజుల క్రితం పుట్టపర్తిలో ప్రారంభించిన శత జయంతి ఉత్సవాల వేడుకల్లో ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానన్నారు.
అక్కడి వాతావరణం, వచ్చిన భక్తులను చూసిన తర్వాత బాబా ఇక్కడ లేరని భావన నాలో నుంచి పోయిందని తెలిపారు. సత్య సాయిబాబా ఇక్కడే ఉన్నారని, అందుకే దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, దేశంలోని అనేకమంది ప్రముఖులు పుట్టపర్తికి వస్తున్నారని బాబా దివ్య శక్తి ఇక్కడ ఉన్నందునే ఇంతమంది రావడానికి ప్రధాన కారణమని రామ్మోహన్ నాయుడు అన్నారు.
ఎడారి ప్రాంతంగా ఒకప్పుడు పుట్టపర్తి ఉండేదని, తాగునీరు కూడా దొరికే పరిస్థితులు లేవని అటువంటి ప్రాంతంలో ప్రజలందరికీ తాగునీటిని అందించడమే కాకుండా ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు కూడా అందించారని, పుట్టపర్తిని ప్రపంచంలోనే ఒక ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన భగవంతుడు సత్య సాయిబాబా అని కొనియాడారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి సేవా కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావలసినా తాము అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పైడిశెట్టి జయంతి, టిడిపి నాయకులు దాసు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
