జైనూర్‌లో ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలు విజయవంతం

జైనూర్, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆదేశాల మేరకు జైనూర్ మండలంలో ఆదివారం నిర్వహించిన ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షలకు గ్రామైక్య సంఘాల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మండలంలోని 26 గ్రామపంచాయతీలలో 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 800 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా 930 మందికి పైగా మహిళలు పరీక్షలు రాశారని జైనూర్ ఐకేపీ ఏపీఎం శ్రీకాంత్ తెలిపారు.
జైనూర్, గూడమామడ పంచాయతీల్లోని పరీక్షా కేంద్రాలను జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్, గూడమామడ సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు, మండల సమైక్య అధ్యక్షురాలు కడప మోతుబాయి, ఏపీఎం శ్రీకాంత్ పరిశీలించారు.
పరీక్షలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయని ఏపీఎం తెలిపారు. ఈ పరీక్షల ద్వారా మహిళలకు విద్యా అవగాహన పెరిగి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతారని పేర్కొన్నారు. పరీక్షలు రాసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు.
