Rupee Falls to 94.29 : 100 కు చేరువలో .. రూపాయి

Rupee Falls to 94.29 : 100కు చేరువలో . రూపాయి
- అటు పశ్చిమ ఆసియాలో ఘర్షణ
- ఇటు ఆయిల్ కుంపటి
- డాలర్ తగ్గదు రూపాయి పెరగదు
- 94.29లతో కనిష్ట రికార్డు
- 100 కి 5.71 కే తక్కువ
( ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్)
పశ్చిమ ఆసియాలో భాంబుల వర్షం ఆగటం లేదు. ఉత్తుత్తి రాజీ మంత్రాంగం కాస్త తూతుమంత్రం కథలు చెబుతుంటే.. చమురు ధర స్పీడ్ కు బ్రేక్ పడటం లేదు. ప్రపంచం అల్లకల్లోలమైనప్పటికీ డాలర్ అసలు తగ్గటం లేదు. ఇక వివిధ దేశాల లోకల్ కరెన్సీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. శుక్రవారం (మార్చి 27, 2026) ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూలపడింది 33 పైసలు పతనం కావటంతో రూపాయి విలువ 94.29 వద్ద సరికొత్త కనిష్ట రికార్డకు చేరుకుంది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్‌లో, రూపాయి 94.18 వద్ద ప్రారంభం కాగా.. మునుపటి ముగింపుతో పోలిస్తే 33 పైసలు తగ్గి, డాలర్‌తో పోలిస్తే 94.29కి పడిపోయింది. బుధవారం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 20 పైసలు క్షీణించి, 93.96 వద్ద కనిష్ట రికార్డు స్థాయికి చేరింది. శ్రీ రామ నవమి సందర్భంగా గురువారం (మార్చి 26) స్టాక్, ఫారెక్స్, కమోడిటీ బులియన్ మార్కెట్లు మూతపడ్డాయి.
Rupee Falls to 94.29 : ఆయిల్ దోబూచులాట..
తాజా “బ్రెంట్ ఆయిల్ మళ్లీ బ్యారెల్ ధర $105.75 దాటింది, డాలర్ ఇండెక్స్ 100 వైపుగా పెరుగుతుండటంతో, రూపాయి నీరసంగా ప్రారంభమైంది,” అని ఫిన్‌రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ LLP ట్రెజరీ హెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ అన్నారు. 6 కరెన్సీల బాస్కెట్‌తో పోలిస్తే డాలర్ ఇండెక్స్, 0.08% పెరిగి 99.67 వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్, రాత్రికి రాత్రి పెరిగి, చివరికి కాస్త తగ్గి, ఫ్యూచర్స్ ట్రేడ్‌లో బ్యారెల్‌కు 0.78% తగ్గి $107.1 వద్ద నిలిచింది.
Rupee Falls to 94.29 : అబ్బ.. మదుపర్ల దెబ్ప
“ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 10 రోజులు వాయిదా వేయడంతో, బ్రెంట్ ఆయిల్ బ్యారెల్‌కు $107.50కి పెరిగినప్పటికీ పడిపోయింది,” అని భన్సాలీ తెలిపారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ విషయానికొస్తే, ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 926.92 పాయింట్లు పడిపోయి 74,346.53 వద్ద ముగియగా, నిఫ్టీ 280.95 పాయింట్లు తగ్గి 23,025.50 వద్ద ఉంది. ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు బుధవారం (మార్చి 25) నికర ప్రాతిపదికన ₹1,805.37 కోట్ల ఈక్విటీలను విక్రయించారు.
