ఉత్తమ రోయింగ్ కేంద్రంగా కృష్ణానది..

ఉత్తమ రోయింగ్ కేంద్రంగా కృష్ణానది..
విజయవాడ, ఆంధ్రప్రభ : కృష్ణా నదిని దేశంలోనే ఉత్తమ రోయింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చర్యలు ప్రారంభమైనట్లు కాకాని తరుణ్ వెల్లడించారు. రాష్ట్రాన్ని రోయింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో ముందంజలో నిలిపేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఇస్మాయిల్ బైగ్ మద్దతు కోరినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రంలో నైపుణ్యమైన రోయింగ్ కోచ్‌ల కొరత ఉన్నదని, దీనివల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎదగడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
విజయవాడలో కోచ్‌ల నియామకంపై ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ ను అభ్యర్థించినట్లు తెలిపారు. సరైన ప్రణాళిక, సదుపాయాలతో ముందుకు వెళితే ఆంధ్రప్రదేశ్‌ను రోయింగ్ హబ్‌గా తీర్చిదిద్దవచ్చని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ బైగ్ మాట్లాడుతూ, తాను ఆరు సార్లు ఒలింపిక్స్‌కు కోచ్‌గా సేవలందించిన అనుభవం కలిగినవాడినని, ద్రోణాచార్య అవార్డు గ్రహీతనని తెలిపారు.

కృష్ణా నది రోయింగ్ క్రీడకు అత్యంత అనుకూలమని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసే సామర్థ్యం ఈ ప్రాంతానికి ఉందన్నారు. తరువాత డా. కాకాని, ఇస్మాయిల్ బేగ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కోచ్ కృష్ణమూర్తి పాల్గొన్నారు.
