రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ కె.వి. మహేష్ మార్గదర్శకత్వంలో శనివారం లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌవలసముద్రం టోల్ ప్లాజా రోడ్డుపై ప్రత్యేక వాహన తనిఖీ కార్యక్రమం నిర్వహించినట్లు హిందూపురం రూరల్ సర్కిల్ సీఐ జనార్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర, పోలీసు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా సిఐ,జనార్ధన్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని,హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించి, నిర్లక్ష్యంగా వాహనం నడిపితే జరిగే ప్రమాదాలపై కౌన్సెలింగ్ నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో స్పష్టంగా తెలియజేశారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేసి, తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. భవిష్యత్తులో తప్పకుండా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని వాహనదారులు హామీ ఇచ్చారని సీఐ తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రాణ రక్షణకే హెల్మెట్ ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ జనార్ధన్ ప్రజలను కోరారు.

Leave a Reply