భద్రతా ఏర్పాట్లు సమీక్ష
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఈవీఎం గోదాముల్లో భద్రతాపరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Badawat Santosh) అన్నారు. ఈ రోజు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈవీఎం(EVM)లను భద్రపరిచిన గోదామును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదాములో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, యాక్సెస్ కంట్రోల్(Access Control) వ్యవస్థలను ఆయన సమీక్షించారు.
సాంకేతిక సిబ్బందితో మాట్లాడి యంత్రాల నిర్వహణ, రికార్డు నిర్వహణ, రోజువారీ పర్యవేక్షణ తెలుసుకున్నారు. ఈవీఎంలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలన్నారు. భద్రతా పరికరాలు ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవాలన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గోదాములో అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, విద్యుత్(Electricity) సదుపాయాలు, రక్షణ గార్డుల విధుల అంశాలను కూడా ఆయన పరిశీలించారు.
ఎన్నికల సామగ్రి భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగేందుకు భద్రతా చర్యలు అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్(Ravikumar), రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎం.డి.హుస్సేన్, శివ కృష్ణ పాల్గొన్నారు.