Reservoir | నీటి లీకేజ్ ని పూర్తిగా అరికట్టండి..

Reservoir | నీటి లీకేజ్ ని పూర్తిగా అరికట్టండి..
Reservoir | అవుకు రూరల్, ఆంధ్రప్రభ : అవుకు రిజర్వాయర్ రివిట్మెంటు పనుల్లో లీకేజీలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు సూచించారు. ఆదివారం తిమ్మరాజు రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరులతో మంత్రి బీసీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్లే అవుకు రిజర్వాయర్ ను పట్టించుకోక పోయారన్నారు. అవుకు జలాశయం రివిట్మెంట్ (Revitment) మరమ్మత్తు పనులను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని, మంత్రి ఎస్ఆర్బిసి ఎస్ఈ రెడ్డి, శేఖర్ రెడ్డి, ఈ ఈ శుభకుమార్ లకు సూచించారు.

భవిష్యత్తులో లీకేజ్ (Leakage) సమస్య ఉత్పన్నం కాకుండా పూర్తి స్థాయిలో పరిశీలించి, మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను మంత్రి కోరారు. మరమ్మత్తు పనులకు నిధులు సరిపోకపోతే ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులు తీసుకొస్తామన్నారు మంత్రి. మరమ్మత్తుల పనుల్లో నాణ్యత ప్రమాణాలు విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గత మూడేళ్ల క్రితం రిజర్వాయర్లో బోటింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి న్యాయం చేసి, బోటింగును పునః ప్రారంభిస్తామన్న మంత్రి బీసీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్బిసి అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
