తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్న వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో రేపు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రహదారులు, ఇళ్లు, పంటలు, సహాయక చర్యల పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం సిద్ధమయ్యారు.
ఈరోజు సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీతో సమీక్ష నిర్వహించారు. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే తప్పక చేస్తానని ఆయన ప్రకటించారు. మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో, వరంగల్‌లో తక్షణ సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే తొమ్మిది రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పడవలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, హైదరాబాద్ నుంచి హైడ్రా టీంలను వెంటనే వరంగల్‌కు తరలించాలని సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
ఇళ్ల పైకప్పులపై లేదా వరదలో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీరు, ఫుడ్ పాకెట్లు పంపిణీ చేయాలని సూచించారు. అలాగే కలెక్టరేట్‌లో 24 గంటల టోల్‌ఫ్రీ హెల్ప్‌సెల్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హెల్ప్‌లైన్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం ఆదేశించారు.

