ప్రైవేట్ కంపెనీల కుట్రలను తిప్పికొడతాం

ప్రైవేట్ కంపెనీల కుట్రలను తిప్పికొడతాం

ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్

దమ్మపేట,ఆంధ్రప్రభ : ఆయిల్ పామ్ గెలల నిర్ణయంలో ప్రైవేట్ కంపెనీలు చేస్తున్న కుట్రలను న్యాయపరంగా తిప్పి కొడతామని ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ పేర్కొన్నారు .దమ్మపేట మండల పరిధిలోని అల్లిపల్లి గ్రామంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అశ్వరావుపేట, పెదవేగి కర్మాగారాల నూనె దిగుబడి ని సరాసరి చేసి గెలల కు ధర నిర్ణయం చేసేవారు అన్నారు.

రాష్ట్రం విడిపోయిన అనంతరం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో అప్పారావుపేటలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కొత్త ఫ్యాక్టరీని నిర్మించుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పండిన ఆయిల్ పామ్ గెలలను అశ్వరావుపేట కర్మాగారం నిలిపివేస్తే అప్పారావుపేటలో,అప్పారావుపేట కర్మాగారం ఆపితే అశ్వరావుపేటలో గానుగ ఆడటం జరుగుతుందన్నారు.

రెండు కర్మాగారాల్లో అత్యధిక నూనె దిగుబడి సాధించిన కర్మాగారాన్ని ఆధారంగా చేసుకుని రైతులకు గెలల ధర నిర్ణయించాలని ఆయిల్ ఫామ్ రైతు సంఘం తరఫున తాము చేసిన పోరాటం ఫలించింది అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంగా అత్యధిక దిగుబడి సాధించిన అప్పారావుపేట ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని దిగుబడి ఆధారంగానే రైతులకు గెలల ధర ఆయిల్ ఫెడ్ చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క కర్మాగారం పూర్తి చేయని ఏడు ప్రైవేట్ కంపెనీలు కలిసి అశ్వరావుపేట, అప్పారావుపేట కర్మాగారాల ఆయిల్ రికవరీని సరాసరి చేసి గెలలధర ఇవ్వాలని కొద్ది రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ప్రైవేట్ కర్మాగారాలు అడ్డుకొని, రైతులకు అత్యుత్తమ దిగుబడి ఆధారంగానే గెలల ధర దక్కేందుకు ఆయిల్ ఫామ్ రైతు సంఘం తరఫున సుప్రీంకోర్టు, హై కోర్ట్ కు చెందిన ఇద్దరు న్యాయవాదులతో తాము ఈ నెల 26న హైకోర్టులో వాదనలు వినిపించనున్నామన్నారు.

రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో మాజీ జెడ్పిటీసి పైడి వెంకటేశ్వరరావు,కె వి సత్యనారాయణ,దమ్మపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, దొడ్డా ప్రసాద్, ఎర్రా వసంతం,మన్నెం అప్పారావు,సత్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.

Leave a Reply