Railway | పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష

Railway | పలు స్టేషన్లలో అమృత్ పథక పనుల సమీక్ష
Railway | కర్నూలు బ్యూరో , ఆంధ్రప్రభ; దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ డోన్–సికింద్రాబాద్ రైల్వే సెక్షన్‌ను సమగ్రంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మతో పాటు సీనియర్ అధికారులు తనిఖీలో పాల్గొన్నారు. డోన్ నుంచి సికింద్రాబాద్ వరకు రియర్ విండో తనిఖీ నిర్వహించిన జనరల్ మేనేజర్, మార్గమధ్యంలోని ప్రధాన స్టేషన్లను పరిశీలించారు. ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనల భద్రతా అంశాలను సమీక్షించారు.
కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకులకు అందుతున్న సౌకర్యాలు, స్టేషన్ ప్రాంగణ పరిస్థితులను పరిశీలించారు. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా రూ.46.62 కోట్లతో చేపట్టిన పునరాభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. తదుపరి ఎస్.బి.బి జోగుళాంబ రైల్వే స్టేషన్‌లో రూ.6.7 కోట్లతో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. గద్వాల్ రైల్వే స్టేషన్‌లో రూ.42.82 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కృష్ణ వంతెన వద్ద భద్రతా తనిఖీ నిర్వహించి ట్రాక్‌మెన్‌లతో మాట్లాడారు. అరేపల్లి వద్ద లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 96-ఈను పరిశీలించి భద్రతా చర్యలపై గేట్‌మ్యాన్‌తో చర్చించారు.
మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్‌లో అమృత్ పథకం కింద రూ.39.82 కోట్లతో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను పరిశీలించారు. నిర్మాణ ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. రన్నింగ్ రూమ్, సిబ్బంది లాబీని తనిఖీ చేసి బ్రీత్ అనలైజర్ పరికరాల పనితీరును పరిశీలించారు. ఆర్.ఎస్ వాల్వ్ సిమ్యులేటర్‌ను ప్రారంభించారు.
జడ్చర్ల రైల్వే స్టేషన్‌లో రూ.36.67 కోట్లతో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. సిగ్నల్, టెలికాం విభాగం ప్రదర్శించిన పరికరాలను పరిశీలించారు. అనంతరం షాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను పరిశీలించి, రూ.32.99 కోట్లతో జరుగుతున్న అమృత్ స్టేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. తనిఖీ సందర్భంగా పలు ప్రజా ప్రతినిధులు కలుసుకుని తమ ప్రాంతాలకు సంబంధించిన రైల్వే అభివృద్ధి పనులపై విజ్ఞప్తులు సమర్పించారు.

