T20I-W | విశాఖ‌లో షఫాలీ సునామీ బ్యాటింగ్ !!

T20I-W | విశాఖ‌లో షఫాలీ సునామీ బ్యాటింగ్ !!

ఆంధ్రప్రభ : విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు మరోసారి విశ్వరూపం ప్రదర్శించింది. శ్రీలంకను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించిన టీమిండియా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది.

శ్రీలంకను కట్టడి చేసిన భారత బౌలర్లు

టాస్ గెలిచిన భారత్ మరోసారి బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు స్నేహ్ రాణా (1/11), శ్రీ చరణి (2/23) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక బ్యాటర్లలో హర్షిత సమరవిక్రమ (33), కెప్టెన్ చామరి ఆటపట్టు (31) కాస్త ప్రతిఘటించారు. యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి రెండు వికెట్లను ఖాతాలో వేసుకుంది.

T20I-W

T20I-W | రికార్డు ఛేదన..

129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభం నుండే విరుచుకుపడింది. తొలి 10 ఓవర్లలోనే భారత్ 113 పరుగులు సాధించి, టీ20 చరిత్రలో తన అత్యుత్తమ 10 ఓవర్ల స్కోరును (గతంలో 111 vs మలేషియా) నమోదు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, మొత్తం 24 బంతుల్లో 69 పరుగులు (11 ఫోర్లు, 1 సిక్స్) బాది శ్రీలంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది. స్మృతి మంధాన (14), జెమిమా రోడ్రిగ్స్ (26) మెరుపులు మెరిపించగా, చివరలో రిచా ఘోష్ విన్నింగ్ రన్ కొట్టింది. దీంతో 11.5 ఓవర్లలోనే మ్యాచ్ ని ముగించేసింది టీమిండియా.

మొదటి మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ రాణించగా, ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ తన అటాకింగ్‌ గేమ్‌తో భారత్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. 49 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం భారత్ ఆధిపత్యానికి నిదర్శనం. సిరీస్‌లో నిలవాలంటే శ్రీలంక ఇకపై వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 డిసెంబర్ 26, శుక్రవారం తిరువనంతపురంలో జరగనుంది.

ఇది కూడా చదవండి : Women’s Cricket | దేశవాళీ ప్లేయర్లపై కాసుల వర్షం !!

కెప్టెన్ గా హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు

ఈ విజయంతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అంతర్జాతీయ మహిళా టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లానింగ్ (76 విజయాలు) రికార్డును సమం చేసింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌కు చెందిన హీథర్ నైట్ (72), షార్లెట్ ఎడ్వర్డ్స్ (68) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మరో విజయం సాధిస్తే హర్మన్‌ప్రీత్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్‌గా చరిత్ర సృష్టిస్తుంది.

Leave a Reply