Posani Remanded: ఖైదీ నంబర్ 2261

టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళీకి కోర్టు బిగ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను రాజాంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 2261ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోసానిని విడిపించేందుకు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.

9 గంట‌ల పాటు విచారణ…
కాగా, పోసానిని గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో దాదాపు 9 గంట‌ల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆయన్ను విచారించారు. అనంతరం అక్కడ నుంచి నిన్న రాత్రి 9.30 గంటలకు పోలీసులు రైల్వేకోడూరులోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ రాత్రి 9.30 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు ఇరుపక్షాల వాద‌న‌లు కొన‌సాగాయి. అదే సమయంలో పోలీసుల తరఫు లాయర్లు రిమాండ్ రిపోర్టును కోర్టుకి సమర్పించారు.

పోసాని కృష్ణమురళిని 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో కోరారు. మరోవైపు పోసాని త‌ర‌ఫున దాదాపు 20 మందికి పైగా లాయర్లు కోర్టుకు హాజరయ్యారు. ఇందులో భాగంగా పోసాని తరఫున పొన్నవోలు సుధాక‌ర్‌ వాద‌న‌లు వినిపించారు. ఈ మేరకు పోసానికి బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. కానీ న్యాయమూర్తి అందుకు నిరాక‌రించారు. దీంతో పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కోర్టు తీర్పుతో పోసాని మార్చి 13 వ‌ర‌కు రిమాండ్‌లో ఉండ‌నున్నారు.

రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు…
రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విష‌యాలను బయటపెట్టారు. పోసాని త‌న మాటలతో కులాల మ‌ధ్య చిచ్చు పెట్టార‌ని అభియోగాలు మోపారు పోలీసులు. అంతేకాకుండా ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు ఆయ‌న కుటుంబంపై నోటికి వ‌చ్చిన‌ట్లుగా దూషించార‌ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు. అక్కడితో ఆగకుండా ఆయన నంది అవార్డుల క‌మిటీపై కూడా కులం పేరుతో అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారని పేర్కొన్నారు. అలాగే నారా లోకేశ్‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో తిట్టార‌ని అందులో తెలిపారు.

ఏం జరిగిందంటే?
పోసాని కృష్ణ మురళి గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు నెట్టింట పలు వీడియోలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో సైతం వారిపై అసభ్య పదజాలం ఉపయోగించారని ఆరోపిస్తూ.. పోసానిపై పోలీసు స్టేషన్‌లలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పోసాని కృష్ణ మురళిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. రాయచోటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఏపీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.

అనంతరం ఆయనపై సెక్షన్‌ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. మరోవైపు పోసానిని పోలీసులు తీసుకెళ్లడంతో ఆయనకి సంబంధించిన పలు వీడియోలను టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. గతంలో అతడు చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *