poling | లక్షేట్టిపేట లో 76.80 శాతం పోలింగ్

poling | లక్షేట్టిపేట లో 76.80 శాతం పోలింగ్
poling | లక్షేట్టిపేట,ఆంధ్ర ప్రభ ; రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం లక్షేట్టిపేట మున్సిపాలిటీలో 76.80 శాతం పోలింగ్ నమోదైనట్లు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సాగిన ఓటింగ్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.లక్షేట్ పేటలో మొత్తం 15 వార్డులు ఉండగా, వార్డుకు రెండు చొప్పున మొత్తం 30 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.మున్సిపాలిటీ లో మొత్తం 18331 మంది ఓటర్లుండగా, వీరిలో 6727 మంది పురుషులు, 7351 మంది స్త్రీలు ఓటు వేశారు. మొత్తం 14078 ఓట్లు పోలై నట్లు అధికారులు వెల్లడించారు.
ఐదవ వార్డ్ లోని స్థానిక శిశు మందిర్ పోలింగ్ కేంద్రంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ ఎలక్షన్ ఏజెంట్ గా ఉండి పలుమార్లు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి వస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా మారి తమకు అన్యాయం చేస్తున్నారని మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అదే విధంగా 14వ వార్డుకు సంబంధించి స్థానిక మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద కొందరు ప్రెస్ పేరుతో పదేపదే లోపలికి వెళ్తున్నారని ఫిర్యాదు రావడంతో ఎస్సై గోపతి సురేష్ వెంటనే స్పందించి అక్కడ గుమ్మిగూడిన వారిని చెదరగొట్టారు.అంతే కాకుండా సుమారు గంట వరకు ఇతరులను లోపలికి అనుమతించలేదు.
12వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. అధికార పార్టీ నాయకులు విపక్షాలను ఓటింగ్ కేంద్రాల వద్ద లేకుండా నిరోధించారనే ఆరోపణలతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గొడవను సద్దుమనిగేలా చేశారు. ఐదవ వార్డులోని శిశు మందిర్ పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును డీసీపీ పర్యవేక్షించారు. జూనియర్ కళాశాలలోని 10, 15 పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పర్యవేక్షకులు గంగాధర్ పరిశీలించారు. చిన్న చిన్న సంఘటనలు మినహా మునిసిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, పోలింగ్ విధులు నిర్వహిస్తున్న అధికారులకు,సిబ్బందికి భోజన ఏర్పాట్లను సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, మున్సిపాలిటీలో ఈసారి పోలింగ్ సరళి తలలు పండిన నాయకులకు కూడా అందలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ జరిగినప్పటికీ నాయకుల సేవ గుణం,నిజాయితీలకే ప్రజలు పట్టం కడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
