Police security | పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Police security | పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
Police security | గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్, జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఉమ్మడిగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మకంగా గుర్తించిన పెద్దపల్లి, అమరావాయి, మల్దకల్, బింగిదొడ్డి, బుడమొరుసు, రాజోలి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి ఓటరు నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో తన ఓటు హక్కును వినియోగించుకునేలా అనుకూల పరిస్థితులు కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పటిష్ట పోలీస్ బందోబస్తు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాల నిర్వహణ, బ్యారికేడింగ్, సీసీటీవీ పర్యవేక్షణ, క్యూలైన్ల క్రమబద్ధీకరణ వంటి భద్రతా చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు తెలిపారు. పోలింగ్ సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీల వెంబడి అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, అదనపు ఎస్పీ కె శంకర్, గద్వాల్ డీఎస్పీ మొగిలయ్య, స్థానిక ఎమ్మార్వోలు, ఆర్వోలు, ఎంపీడీవోలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు టంగుటూరి శ్రీను, రవిబాబు, ఆర్.ఐ లు, ఆర్ఎస్ఐ ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
