మల్లన్న భక్తులకు పోలీసు శాఖ సూచనలు

మల్లన్న భక్తులకు పోలీసు శాఖ సూచనలు
- ఓవర్లోడ్తో వాహనాలపై ప్రయాణించకండి
- సామర్థ్యానికి మించి ప్రయాణికులు వద్దు
- వాహనాలలో గ్యాస్ సిలిండర్లు ఉంటే అప్రమత్తంగా ఉండాలి
- కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కర్నూలు జిల్లా మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు వాహనాల్లో ఓవర్లోడ్తో ప్రయాణించకూడదని, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని కర్నూలు జిల్లా ఎస్పీవిక్రాంత్ పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు వెళ్తున్న నేపథ్యంలో కొన్ని వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కించుకొని ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు , ఇతర చిన్న వాహనాల్లో ఓవర్లోడ్గా ప్రయాణించడం వల్ల ప్రాణాపాయం కలగవచ్చని హెచ్చరించారు.
భక్తులకు సూచనలు :
వాహనాల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదు
డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలి
వాహనం నడిపేటప్పుడు వేగం నియంత్రణలో ఉంచి ప్రమాదాలకు దూరంగా ఉండాలి
అలసటగా ఉన్నప్పుడు వాహనం నడపకుండా కొంతసేపు విశ్రాంతి తీసుకుని ప్రయాణం కొనసాగించాలి
ప్రయాణ సమయంలో ఎక్కడైనా సమస్యలు తలెత్తినా లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినా వెంటనే సమీప పోలీసులను సంప్రదించాలి
భక్తుల భద్రత కోసం పోలీసు అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలి. భక్తుల క్షేమమే పోలీసు శాఖకు ప్రధాన లక్ష్యమని , భక్తులు పోలీసులకు సహకరించి సురక్షితంగా ప్రయాణించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
ఓవర్ లోడింగ్ కేసులు
2025 లో 401 కేసులు , 2026 లో ఫిబ్రవరి వరకు 43 కేసులు నమోదు చేసినట్టు కర్నూలు ఎస్పీ తెలిపారు.
