బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం…

బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం…
ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తన పేరు పందుల విష్ణువర్ధన్ అని, తాను నార్కట్ పల్లిలోని ఎస్సీ కాలనీలో ఉంటానని, తాను బైకులు దొంగతనం చేస్తుంటానని, ఈ ప్రాంతంలో ఇప్పటివరకు నాలుగు బైకులను దొంగతనం చేసినట్లుగా నేరం ఒప్పుకోవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని నుంచి నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లుగా చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.
ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం ఈనెల 1వ తేదీ మద్యాహ్నం 12 గంటలకు చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామానికి చెందిన గరిసే రామస్వామి తన స్కూటిని చౌటుప్పల్ లోని ఎల్లప్ప హోటల్ సెల్లార్ లో పెట్టి బయటకు వెళ్లి, మరల తిరిగి వచ్చి చూడగా స్కూటీ కనిపించక పోవడంతో చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకోని ఇన్స్పెక్టర్ చౌటుప్పల్ జి మన్మధకుమార్ ఆదేశాల మేరకు యస్.ఐ కనకటి యాదగిరి, సిబ్బంది మల్లాం సందీప్, ఎం భారద్వాజ్, ఉడుగు సైదులు కలసి ఈ రోజు ఉదయం 8 గంటలకు వలిగొండ ఎక్స్రోడ్ లో వాహనాలు చెకింగ్ చేస్తుండగా స్కూటీ పై వస్తున్న వ్యక్తి పోలీసులను చూసి అట్టి స్కూటీని రివర్స్ లో తీసుకుని పారిపోతుండగా అనుమానం వచ్చి అట్టి వ్యక్తిని పట్టుబడి చేసి, అతన్ని విచారించగా, అతను ఇట్టి స్కూటిని చౌటుప్పల్ లోని ఎల్లప్ప హోటల్ సెల్లార్ నందు దొంగిలించానని, దీనితో పాటు గతంలో పలుచోట్ల 3 మోటార్ సైకిల్స్ ను కూడా గతంలో దొంగిలించినట్లుగా నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో 4 వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసి
జుడీష్యల్ రీమండ్ కు తరలించినట్లుగా ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.
