petition | పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టండి..

petition | పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టండి..
- నష్ట పరిహారం ఇప్పించాలి
- జిల్లా కలెక్టర్‌కు బాధితుల వినతి
petition | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం, దోతిగూడెం గ్రామాల సమీపంలో ఉన్న సుమారు 12 రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోయిన రైతులకు 2017లో అప్పటి కలెక్టర్ నియమించిన కమిటీ నివేదిక ప్రకారం ఒక ఎకరాకు సంవత్సరానికి గాను రూ. 52వేలు నష్టపరిహారం ఇప్పించాలని, పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ పలువురు బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
పరిశ్రమల యాజమాన్యం ప్రలోభాల కారణంగా సంబంధిత నివేదికలు బహిర్గతం చేయకుండా, రైతులను దగా చేస్తూ కేవలం ఒక ఎకరాకు 3200 మాత్రమే ఒకే పర్యాయం ఇచ్చారు. ఈ పరిశ్రమల కాలుష్యం 2017 నుండి ఇప్పటి వరకు క్రమంగా పెరిగిందే తప్ప తగ్గలేదు. ఈ కాలుష్యం కారణంగా రైతులకు నష్టపరిహారం అందజేయుటకు కమిటీ వేయవలెనని పీసీబీ మెంబర్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ కు లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారని, ఈ విషయం శాసనమండలిలో మంత్రి కొండా సురేఖ ధ్రువీకరించారని, పరిశ్రమల నుంచి పర్యావరణ పరిహారం, జరిమానాల పేరుతో పరిశ్రమల నుండి రూ. 5.44 కోట్లు ఫీసీబీ అధికారులు వసూలు చేశారు.
కానీ రైతులకు జరుగుతున్న నష్టం గురించి ఏ అధికారులు స్పందించడం లేదని బాధితులు కలెక్టర్ కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. పరిశ్రమలు చేసే కాలుష్యం వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందుల గురించి, గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమల నుంచి విపరీతమైన వాయు కాలుష్యం జరుగుతున్న విషయం సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు నివేదికలలో ధృవీకరించినప్పటికీ, పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పందించడం లేదన్నారు.
పీల్చే గాలిలో బెంజిన్, టోలిన్, ఇథైల్ బెంజిన్ వంటి అనేక రకాల విషపూరిత వాయువులు చేరి గ్రామ ప్రజల ఆరోగ్యాలను హరిస్తూ, గ్రామస్తుల ఆయుర్దాయంను తగ్గిస్తుందన్నారు. ఈ వాయు కాలుష్యాన్ని గుర్తించుటకు గాను గ్రామ సమీపంలో కంటిన్యూయస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టం (CAAQM ) ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పీసీబీ అధికారులు స్పందించడం లేదని, గ్రామ సమీపంలో ఉన్న పరిశ్రమల వద్ద వసూలు చేసిన పర్యావరణ పరిహారం సంబంధించిన ఐదు కోట్ల రూపాయల నుండి ఈ యంత్రాన్ని ఏర్పరచుకొనుటకు సీపీసీబీ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, యంత్రాన్ని ఏర్పాటుచేస్తే పరిశ్రమలు చేసే కాలుష్యం గుర్తించబడుతుందనే కారణంతో పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు కలెక్టర్ కు తెలిపారు.
ఈ పరిశ్రమ వదిలిన రసాయనాల కారణంగా వ్యవసాయ భూములలోని మట్టిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ సీఓడీ విలువ (0-30 లోపు ఉండాల్సి ఉండగా) 700 నుండి 1000 వరకు చేరినట్లుగా గుర్తించిన కారణంగా పీసీబీ అధికారులు కలుషితమైన మట్టిని 2023 సంవత్సరంలో నాలుగు టిప్పర్ల ద్వారా సుమారు 80 టన్నులు ట్రీట్మెంట్ ప్లాంట్ కు పంపారు. ప్రస్తుతం ఈ పరిశ్రమ సమీపంలో మట్టిలో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ విలువ 16000 వరకు చేరింది.
ఈ రసాయన వ్యర్ధాలతో కూడిన మట్టి ఇలాగే ఉన్నచో భూగర్భ జలాల కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ మట్టిని ట్రీట్మెంట్ ప్లాంట్ కు పంపించకపోగా, నూతనంగా రసాయనాలను పరిశ్రమల బయట వదిలి వేస్తున్న పీసీబీ అధికారులు స్పందించడం లేదని, వెంటనే పరిశ్రమలు చేయు కాలుష్యాన్ని అరికట్టి, తమకు నష్టపరిహారం ఇప్పించాలని, తమ ఆరోగ్యాలను కాపాడాలని కాలుష్య బాధితులు జిల్లా కలెక్టర్ ను వేడుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్‌తో పాటు అంతమ్మగూడెం గ్రామానికి చెందిన కాలుష్య బాధితులు గుమ్మి దామోదర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రావుల బాల్ రెడ్డి, రావుల శివరాజు, రావుల శశి కిరణ్, రావుల శశిరేఖ, వస్పరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
