KNR | ప్రభుత్వ పథకాల్లో జర్నలిస్టుల భాగస్వామ్యం : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల (Journalists) ను ప్రభుత్వ పథకాల్లో భాగస్వాములను చేస్తామని, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పరంగా తనవంతుగా కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) హామీ ఇచ్చారు. శనివారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… గడిచిన పదేళ్లలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులు అందరికీ భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. రాజకీయాలకతీతంగా పాత్రికేయులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పత్రికలు ప్రజలకు వారధిగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై పాత్రికేయులు తమ ఆలోచనా విధానాన్ని వార్తల రూపంలో అందజేయాలని కోరారు. మంథని (Manthani) ప్రాంత జర్నలిస్టుల సమస్యల కోసం తాను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

గతంలో వారి అభివృద్ధి కోసం అనేక విధాలుగా సహకరించానన్నారు. మంథనిలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సీఎస్ఆర్ నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. పాత్రికేయులకు ఇందిరమ్మ ఇండ్లు రాజు యువ వికాస్ పథకాల మంజూరు కోసం కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. టీయూడబ్ల్యూజే (TUWJ) జిల్లా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా ఉపాధ్యక్షుడు కొమురోజు చంద్రమోహన్, కోశాధికారి తగరం రాజు, కార్యవర్గ సభ్యులు లక్కాకుల నాగరాజులను శాలువాలతో మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ఉపాధ్యక్షులు బర్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, సహాయ కార్యదర్శి గంధం అంజిబాబు, ప్రెస్ క్లబ్ సభ్యులు అంకరి ప్రకాష్, కంది కృష్ణారెడ్డి, ఆర్ల బాబు, పెండ్యాల రామ్ కుమార్, బాసాని సాగర్, ఒజ్జల శ్రీనివాస్, లింగాల సురేష్, దొరగొర్ల రవీందర్, కేసారపు రవి, బండారి సమ్మయ్యలు పాల్గొన్నారు.

Leave a Reply