యువజన ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనండి
యువతకు కలెక్టర్ డా. ఎ. సిరి సూచన
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా యువజన సంక్షేమ శాఖ, సెట్కూరు ఆధ్వర్యంలో జరగనున్న జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోస్టర్‌ను కలెక్టర్ డా. ఎ. సిరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువజన ఉత్సవాలు యువత ప్రతిభను వెలికితీసే వేదికగా నిలుస్తాయని, జిల్లాలోని యువత ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శించాలని కోరారు. కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా యువజనోత్సవ పోటీలు ఈ నెల 22న కర్నూలులోని రవీంద్ర మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్నాయి. 15 నుంచి 29 సంవత్సరాల లోపు వయస్సు గల యువ కళాకారులు ఏడు విభాగాలలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు, రాష్ట్ర స్థాయి విజేతలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారని వివరించారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేయబడతాయని, పాల్గొన్న కళాకారులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇవ్వబడతాయని తెలిపారు.
సెట్కూరు సీఈఓ డా. వేణుగోపాల్ మాట్లాడుతూ, పోటీల్లో పాల్గొనదలచిన యువతీ యువకులు తమ పేరు లేదా బృందం పేరును వెబ్ లింక్ https://bit.ly/knldyf25 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ నమోదు సౌకర్యం లేని వారు నేరుగా అక్టోబర్ 22న ఉదయం 9 గంటలలోపు వేదిక వద్ద వచ్చి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు మొబైల్ నంబర్ 92922 07601 ద్వారా సంప్రదించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్‌మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి లాలెప్ప, కలెక్టరేట్ పరిపాలన అధికారి శివరాముడు, సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యామ్‌బాబు పాల్గొన్నారు.