మానవ మనస్తత్వాలు విచిత్రంగా ఉంటాయి. జీతానికి పనిచేసే సేవకుడు కానీ, ఉద్యోగి కానీ మొదటి తారీఖు ఎప్పుడు వస్తుందా? జీతం ఎప్పుడు చేతిలో పడుతుందా అనే ఎదురుచూపులతో నెల మొత్తం పనిచేస్తాడు. ఆ నెల రోజులూ పనిచేస్తేనే కానీ, అతనికి నిర్దేశించిన విధంగా జీతం అందదు. అలా వచ్చే జీతానికి అంకితం అయిపోతాడు అతను.
అయితే భగవంతుడు మాత్రం వెంటనే కరుణ చూపాలని, త్వరగా కటాక్షం ఇవ్వాలని ఆరాట పడతాడు. హుండీలో కానుక వేసి కోరిక కోరతాడు. ఆ కోరిక తాను ఇంటికి చేరేసరికి సఫలం కావాలి. అంతే.. ఇక ఆగలేడు. అంత అంకితభావం ఉండదు. కానుక వేశాను కదా, ప్రయాసపడి ఆలయానికి చేరుకున్నాను కదా, ఆ దేవుడి ముందు సాగిలపడి మొక్కుకున్నాను కదా.. తనను మించిన భక్తాగ్రేసరుడు మరెవరుంటారని ప్రతి భక్తుడూ తనకు తానే గొప్పతనాన్ని ఆపాదించుకుంటాడు. ఇది మానవ నైజం.
దేవుడి కరుణ లభించాలంటే ఒక్కసారి దేవాలయ ప్రవేశం చేయగానే సరిపోతుందా! ఓపిక ఉండవద్ధా? పదేపదే విన్నవించుకోవద్ధా? అతడు ఎంతగా ప్రయాస పడితే ఉద్యోగం లేదా పని దొరుకుతుందని! దొరికిన ఆ కొలువును నిలబెట్టుకోవడానికి అతడెంతగా శ్రద్ధ వహించాలని! ఉద్యోగం తేరగా లేనప్పుడు, దైవానుగ్రహం మాత్రం అంత తేలికగా లభిస్తుందా? అనే విషయం అతడు ఆలోచించడు. ఉద్యోగం మీద ఉన్న నమ్మకం భగవంతుడిపై లేకపోవడమే అతను దేవుని కరుణ పొందలేక పోవడానికి ప్రధాన కారణం.
అనుభవం కొద్దీ తాను పనిచేసే ఉద్యోగంలో నైపుణ్యాన్ని సంతరించు కున్నట్టు, ప్రార్థిస్తూ పోతుంటేనే ఆ ప్రార్థనకు విలువ ఉంటుంది. తదేకంగా ఆ భగవంతుని మీద బాగా దృష్టిపెట్టి, నమ్మకం ఉంచితేనే ఆయన కృప లభిస్తుంది. ఉద్యోగంలో ఓపిక లేకపోతే దానిని కోల్పోతాడు. అలాగే, భగవంతుని మీద ఏ మాత్రం నమ్మకం సడలినా, నిరీక్షణలో ఏ మాత్రం అలసత్వం వహించినా, ఆయన దయకు పాత్రులు కాలేరు.
స్వలాభపేక్షతో భగవంతుని సన్నిధిలో గడిపితే, అందువలన ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఆయన అతడికి జీతం ఇచ్చే యజమాని కాడు. యజమాని తన లాభాన్ని పెంచుకోడానికి అతడి సేవలను వాడుకుంటాడు. భగవంతుడి సేవకులు కోటాను కోట్ల మంది ఉంటారు. భక్తిలో నాణ్యతను పరిశీలించాకనే ఆ భగవంతుడు ఎవరికి ఏ విధమైన ప్రయోజనం చేకూర్చాలో ఆ విధమైన లాభాన్ని చేకూర్చుతాడు.
భగవంతుని కరుణ కోసం ఓరిమి వహించి ఎదురుచూడాలి. అప్పుడే ఆయన కరుణ అతని మీద ప్రసరిస్తుంది. నిత్యమూ ఆ భగవంతుని సేవలో గడిపే వానికి ఏ విధమైన నష్టమూ జరగదు. అందుకు చేయవలసింది సదా ఆయన నామ స్మరణ. నిద్దురలో సైతం ఆ ఆలోచన సద్దు మనగకూడదు.
- పంతంగి శ్రీనివాస రావు