SCHOOL | అంతర్జాతీయ వేదికపై..

SCHOOL | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : అంతర్జాతీయంగా ఆన్లైన్లో నిర్వహించే తానా సభలకు నంద్యాల జిల్లా డోన్ లో చదివే ఐదో తరగతి విద్యార్థిని ఎంపికైనట్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ తొగట సురేష్ బాబు (Dr. Thogata Suresh Babu) మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమణారావులు తెలిపారు. గత ఏడాది కలిసి ఉన్న జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది రెండుగా విభజించారు. ఐదో తరగతి చదువుతున్న లిజా అంజూమ్ ఎంపికైనట్లు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించే అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనంకు ఎంపికైందన్నారు
బాల రచయితల సమ్మేళనంలో భాగంగా “బాలసాహిత్య భేరి”లో పాల్గొనడానికి ఈ విద్యార్థిని ఎంపికైంది. ఈ నెల నవంబర్ 30వ తేదీన ఆన్‌లైన్‌లో 13 గంటల పాటు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 101 మంది విద్యార్థులు (The students) పాల్గొంటారు. విద్యార్థులందరికీ గేయం, పద్యం, కావ్యం, సంస్కృతం వంటి కార్యక్రమాల్లో ఆన్లైన్లో సదస్సు నిర్వహించారు. గేయం విభాగంలో లిజా అంజుమ్ తన గేయాన్ని ప్రదర్శించనుందని తెలిపారు. జిల్లాలో ఈ అమ్మాయి ఎన్నిక కావడం తో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి, నిర్వాహకులు డాక్టర్ తోటకూర ప్రసాద్, సమన్వయకర్త చేరుగమల్ల శ్రీనివాస్‌లకు ప్రధానోపాధ్యాయులు డాక్టర్ తొగట సురేష్ బాబు, రమణారావులు కృతజ్ఞతలు తెలిపారు.
