New Year 2026 | నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే లైసెన్స్ ర‌ద్దు…

New Year 2026 | నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే లైసెన్స్ ర‌ద్దు…

  • న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై డేగ క‌న్ను
  • హైద‌రాబాద్ వీసీ.స‌జ్జ‌నార్

ఆంధ్రప్రభ : కొత్త ఏడాది వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యంతో కఠినమైన యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించారు. నూతన సంవత్సర వేడుకల ముసుగులో డ్రగ్స్ మహమ్మారి విచ్చలవిడిగా ప్రవహించకుండా అడ్డుకోవడమే ధ్యేయంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

శుక్రవారం తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించే పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లపై కనికరం లేకుండా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాటి లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని హెచ్చరించారు. వేడుకల నిర్వహణకు రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉందని, ఆ సమయం దాటితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

నగరంలోని ప్రధాన కూడళ్లు, పబ్‌లతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా నిఘా పెట్టేందుకు హెచ్-న్యూ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలను నిశితంగా గమనించాలని, డ్రగ్స్ సరఫరాదారులు, వినియోగదారుల జాబితాను సిద్ధం చేసి వారిపై డేగ కన్ను వేయాలని అధికారులను ఆదేశించారు.

నగరానికి కొత్తగా వచ్చేవారి వివరాలను కూడా ఆరా తీస్తున్నామని, ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని సీపీ వివరించారు. మైత్రీవనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో భారీగా చెక్ పోస్టులు, బ్యారికేడింగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

న్యూ ఇయ‌ర్ వేడుకల సమయంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసు సిబ్బందికి సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు డ్రగ్స్ పరీక్షలపైనా పోలీసులు ఈసారి ప్రత్యేక శ్రద్ధ కనబరచనున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో డీసీపీలు ఎన్.శ్వేత, అపూర్వ రావు, రక్షిత కృష్ణమూర్తి సహా పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. పోలీసులందరూ సమన్వయంతో పనిచేసి నగరంలో శాంతిభద్రతలను కాపాడాలని, డ్రగ్స్ రహిత వేడుకలకు సహకరించాలని సీపీ సజ్జనార్ నగరవాసులకు పిలుపునిచ్చారు.

Leave a Reply