గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఒక వరం..

గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఒక వరం..

  • నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పాఠశాలకు సురక్షితంగా సకాలంలో చేరుకునే రవాణా సౌకర్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఉచిత పాఠశాల బస్సు ఒక వరం అని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయగా జిల్లాల పరంగా రాష్ట్రంలో మన నారాయణపేట జిల్లా రెండవ జిల్లాగా నిలవడం గర్వకారణమనిఅన్నారు. శనివారం నారాయణ పేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదే గ్రామానికి చెందిన అంబాత్రయ క్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ రూ.40 లక్షల వ్యయం గల పాఠశాల బస్సును ఉచితంగా అందజేశారు.

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ తో కలిసి ఉచిత పాఠశాల బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూదూర ప్రాంత గ్రామాల నుంచి పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందన్నారు.ఈ సేవను బిజ్వార్‌కు చెందిన శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ దాతృత్వంతో ఏర్పాటు చేశారని, ఆయన ఏర్పాటు చేసిన ఈ రవాణా సౌకర్యం ద్వారా మండలంలోని కొత్తపల్లి, పాతపల్లి, మొగ్డుంపూర్ గ్రామాలకు చెందిన మొత్తం 63 మంది విద్యార్థులు ప్రత్యక్ష లబ్ధి పొందనున్నట్లు ఆమె తెలిపారు. ఈ బస్సు సేవ వల్ల విద్యార్థులు సురక్షితంగా, సమయానికి పాఠశాలకు చేరుకొని నిరంతర విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవకాశం ఉందని చెప్పారు.

గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండేందుకు రవాణా సౌకర్యం కీలకమని తెలిపారు. స్థానిక పండుగలు వేడుకల కారణంగా తరచుగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కావడం వారి అభ్యాసానికి అంతరాయం కలిగిస్తుందని పేర్కొంటూ, విద్యకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తల్లిదండ్రులు గ్రామ ప్రజలను కలెక్టర్ కోరారు. తరచూ గైర్హాజరు వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని క్రమబద్ధమైన హాజరుకు కుటుంబాలు సమాజం కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మాట్లాడుతూతాను చిన్నప్పుడు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. ఆ పాఠశాల పట్ల ఉన్న కృతజ్ఞతాభావంతోనే ఈ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశానన్నారు.

తాను చేసింది సేవ కాదని,బాధ్యత కర్తవ్యం అని అన్నారు. తాను చదువుకునే రోజుల్లో ఇంట్లి అన్ని పనులు చేసి పాఠశాలకు ఆలస్యంగా వచ్చేవాడిని, అలాంటిది పక్క ఊర్ల నుంచి విద్యార్థులు నడుచుకుంటూ రావడం సాహసమే అన్నారు. పుట్టిన ఊరికి, చదువుకున్న పాఠశాలకు ఏదో ఒకటి చేయడం ధర్మం అని తెలిపారు. ప్రతిరోజూ విద్యార్థులు నడుచుకుంటూ ఆశ్రమం ముందు నుంచి పాఠశాలకు వెళ్తుండటం చూసి తనకు ఎంతో బాధ కలిగిందని, ఆ కష్టాన్ని తొలగించాలనే సంకల్పంతో ఈ ఉచిత బస్సు సేవను ప్రారంభించానని అన్నారు.2024 లో పాఠశాలకు బస్సు ఇవ్వాలని నిర్ణయించుకుంటే అన్ని నియమ నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయడానికి 2026 జనవరి అయిందన్నారు.

బస్సు విషయంలో ఆర్టీవో ఎంతో సహకరించిందని అన్నారు. సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేయడం ఎంత ముఖ్యమో, అవి చట్టపరమైన పరిమితులలోనే లోబడి ఉండటం మరింత ముఖ్యమని స్వామీజీ పేర్కొన్నారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ ప్రతి కార్యక్రమం చట్టాన్ని గౌరవిస్తూ నిర్వహించాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. దేశంలో ఉన్న స్వామీజీలు దేశానికి ధర్మానికి కట్టుబడి ఉంటారని ఆయన తెలిపారు. బిజ్వార్ జెడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ ఉచిత బస్సు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ తమ లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తన చిన్ననాటి ఉపాధ్యాయురాలు సంజనని దర్శించగానే స్వామీజీ భావోద్వేగానికి లోనయ్యారు.

గురువుల పట్ల తనకు ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ, జీవితంలో ఎదుగుదలకు గురువుల మార్గదర్శకత్వమే అసలు పునాది అని పేర్కొన్నారు. తనకు పాఠశాలలో రెండుసార్లు 50, 50 రూపాయల పరీక్ష ఫీజు చెల్లించిన హిందీ టీచర్ సంజనకు తాను 100 రూపాయలు బాకీ ఉన్నానని, వాళ్ళ ఇంటికి వెళ్ళి 100 రూపాయలు ఇస్తానని నవ్వుతూ చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ అధికారి గోవిందరాజులు మాట్లాడుతూఆధ్యాత్మిక రంగంలో ఉన్న వ్యక్తి స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యార్థుల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టడం అత్యంత ఆదర్శప్రాయమని అభినందించారు.

సమాజంలోని అన్ని వర్గాలు విద్యాభివృద్ధికి తోడ్పడితే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ఈ సేవను అభినందిస్తూ, ఇది విద్యార్థుల ప్రయాణ కష్టాలను తగ్గించి పాఠశాల హాజరును మెరుగుపరుస్తుందని తెలిపారు. అంతకు ముందు జిల్లా పరిపాలన తరఫున కలెక్టర్ స్వామీజీ దాతృత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత మందిని విద్యాభివృద్ధి దిశగా ప్రేరేపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీవో మేఘా గాంధీ, తహాసిల్దార్ చింత రవి, ఎంపీడీవో కిషోర్ కుమార్, బిజ్వార్ గ్రామ సర్పంచ్ అంజయ్య, కొత్తపల్లి సర్పంచ్ నర్సిములు, పాతపల్లి సర్పంచ్ టేరప్ప, మొగ్డుంపూర్ సర్పంచ్ తిరుమలేష్, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం కిషోర్ కుమార్, విద్యాశాఖ అధికారులు రాజేంద్ర కుమార్, విద్యాసాగర్, నాగార్జున రెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు నరసింహ, నాయకులు శేర్ కృష్ణ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ పద్మమ్మ, వార్డు సభ్యులు తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply