Narasaraopet | ఎక్కడా చెత్త ఉండొద్దు..

Narasaraopet | ఎక్కడా చెత్త ఉండొద్దు..
- పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
Narasaraopet | నరసరావుపేట, ఆంధ్రప్రభ : స్వచ్ఛ సంక్రాంతి – స్వచ్ఛ నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పట్టణంలోని వల్లప్ప చెరువు పరిసరాలు, కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం వద్ద నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను స్వయంగా పరిశీలించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన సందర్భంగా ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, రోజుకు పలుమార్లు చెత్త సేకరణ జరగేలా ప్రణాళిక రూపొందించాలని పురపాలక సంఘం అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. డ్రెయిన్ల శుభ్రత, రోడ్ల పక్కన చెత్త తొలగింపు, ప్రజా ప్రదేశాల్లో శానిటేషన్ స్ప్రే వంటి పనులు వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పండుగ వేళ పట్టణం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా పండుగను జరుపుకోగలుగుతారన్నారు. స్వచ్ఛత అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అని ప్రజలు కూడా చెత్తను ఎక్కడికక్కడ వేయకుండా సహకరించాలన్నారు. అలాగే పారిశుధ్య కార్మికులకు అవసరమైన భద్రతా సామగ్రి, గ్లౌవ్స్, మాస్కులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. పండుగ రోజుల్లో అదనపు సిబ్బందిని నియమించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుధ్య విభాగ సిబ్బంది, పాల్గొన్నారు.
