ఆదిలోనే అడ్డుకోవాలి!
మహాదేవపూర్, ఆంధప్రభ : ప్రజలను మోసం చేయడానికి ఒక్కో వ్యక్తి ఒక్కో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. ప్రజలకు ఆశ చూపడం.. తర్వాత మోసం చేయడం ఆనవాయితీగా మారింది! ఒక వైపు ఆన్‌లైన్ మోసాలు(Online scams).. మరోవైపు అధిక వడ్డీలు ఇస్తామంటూ ఆశ చూపి బోర్డులు తిప్పడం.. అలాగే డ్రాల పేరుతో డబ్బులు వసూలు చేయడం.. ఇలా ఎన్నో మోసాలకు ఎందరో తెరతీస్తున్నారు! ఇలాంటి వారి మోసాలకు ప్రభుత్వ అధికారులు, పోలీసులు(police) మౌనం వహించడం…స్థానికులకు కమీషన్ల ఇస్తూ ఈ మోసాల్లో భాగస్వామ్యం చేయడం ఆనవాయితీగా మారింది.
ఇలాంటి మోసాలను ఆదిలోనే అడ్డుకోకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా ఫలితం ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో నల్లగొండ జిల్లా(Nallagonda District)లో రామావత్ బాలాజీ నాయక్ అనే వ్యక్తి తండా ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇటీవల బాలాజీ నాయక్ బాధితుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అందుకు తండా వాసులు ఆగ్రహానికి గురై బాలాజీ నాయక్(Balaji Nayak) ఇంటిని ధ్వంసం చేశాడు. అయినా ఇంతవరకూ పేదలకు న్యాయం జరగలేదు. మోసాలను ఆదిలోనే అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. లేకుంటే ఎందరో అమాయక ప్రజలు మోసపోతారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారం పడిపోవడంతో రియల్టర్లు వినూత్నదందాకు తెరలేపుతున్నారు. రూ.5001కొట్టు, రూ. కోటి కి పైగా విలువ చేసే బిల్డింగ్, బంగారు, వెండి గెలుచుకోండి అంటూ బంపర్ డ్రా లు ఏర్పాటు చేస్తూ సామాన్య ప్రజలకు ఆశచూపుతున్నారు. అయినా కొందరు వ్యాపారులు గ్రామీణ ప్రాంత యువతను ఏజెంట్లగా నియమించుకుని రూ. 500 కమీషన్ లతో డ్రా కూపన్లు(Draw Coupons) యథేచ్ఛగా అమ్మిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా కూడా కుపన్లు విక్రయిస్తున్నట్లు సమాచారం.
మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక పెద్ద బిల్డింగ్ బంపర్ ఆఫర్(Bumper Offer) ఇస్తూ లక్కీ డ్రా పేరుతో అమ్మకానికి పెట్టారు. అనుమతులు లేకున్నా ఒక కూపన్ కు రూ. 5001 ధర నిర్ణయించి మండలాల వారిగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని 2,500 మంది సభ్యులకి కూపన్స్ అందించేలా ఏర్పాట్లు చేశారు.
మొదటి బహుమతి రూ. 1కోటి 50 లక్షల భవనం, రెండో బహుమతి రెండు తులాల బంగారం, మూడవ బహుమతి కిలో వెండి అని ఆశ చూపడంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ కావడంతో ఇప్పటికే వందల సంఖ్యలో కూపన్లు అమ్మేశారు. బిల్డింగ్ లొకేషన్(Building Location) తెలంగాణ లో ఉండగా, డ్రా మాత్రం మహారాష్ట్ర లో తీస్తామని కూపన్ లో ముద్రించడంతో ఈ డ్రా పై కొందరికి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్వాహకుల సంస్థకు ఎలాంటి అనుమతులు గానీ, రిజిస్ట్రేషన్ కూడా లేదని పోలీసుల దృష్టికి వచ్చింది.
లెక్కలు గమనిస్తే.. ఇదీ పెద్ద మోసానికి తెరదించినట్లే!
సంస్థ పేరు లేకుండా బ్రోచర్‌ను విడుదల చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా కూపన్లు విక్రయిస్తున్నారు. మొదటి బహుమతి రూ.కోటీ 50 లక్షల విలువ చేసే ఇల్లు, రెండో బహుమతి రెండు తులాలు బంగారం అంటే సుమారు ఐదు లక్షల రూపాయలు, మూడో బహుమతి(Bounty) కిలో విలువ చేసే వెండి అంటే సుమారు లక్షన్నర రూపాయలు పైగా ఉంటుంది. మొత్తం బహుమతుల విలువ కోటీ అరవై లక్షల రూపాయలు ఉంటుంది. అయితే ఒక్క కూపన విలువ రూ.5001 ధర నిర్ణయించి 2500 కూపన్లు విక్రయిస్తున్నట్లు బ్రోచర్(Brochure)లో పేర్కొన్నారు.
అంటే ఆదాయం రూ.1,25,02,500 లు వస్తుంది. ఇందులో ఒక కూపన్ విక్రయించే ఏజెంట్‌కు రూ.500 ఇస్తారు. అంటే సుమారు 12,50,000 రూపాయలు ఏజెంట్లకు చెల్లిస్తారు. సంస్థకు రూ.1,12,52,500 లు మాత్రమే ఆదాయం ఉటుంది. బహుమతులు విలువను చూస్తే సుమారు కోటీ అరవై లక్షలు(Crore Sixty Lakhs) రూపాయలు ఉన్నాయి. ఆదాయం రూ.1,12,52,500 లు వస్తుంది. అంటే రూ.47,47,500 లు నష్టం కనిపిస్తోంది. ఏ వ్యాపారి కూడా లాభం లేకుండా వ్యాపారం చేయరు.
దీని బట్టి ప్రజలను మోసం చేయడానికి ఈ రకంగా ప్లాన్ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు చెప్పింది ఒకటి, నిర్వహకులు చేసింది ఒకటి. అంటే నిర్వహకులు అమ్మిన కూపన్లుల్లో నకిలీవి కూడా విక్రయించే అవకాశాలు లేకపోలేదు.