YCP | మునిసిపల్ నిధులున్నా.. అభివృద్ధి సున్నా

YCP | మునిసిపల్ నిధులున్నా.. అభివృద్ధి సున్నా


గుడ్ మార్నింగ్ నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి విమర్శలు

YCP |నరసరావుపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (Dr. Gopireddy Srinivas Reddy) ఆదివారం నిర్వహించిన ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమానికి ప్రజలనుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన నరసరావుపేట పట్టణంలోని 31వ వార్డు, పాలపాడు – రామిరెడ్డి పేట కనెక్టింగ్ రోడ్డు ఏరియాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. పట్టణంలోని 31వ‌ వార్డు దర్గా వద్ద నుంచి వల్లప్ప చెరువు వైపు పోయే రోడ్డు పూర్తిగా గుంతల మయమై ఉందని, వాహనాలు ప్రయాణించడానికే కాకుండా పాదాచారులకు (For pedestrians) కూడా ఈ రోడ్డుపై నడవడానికి ఎంతో ఇబ్బందికరంగా ఉందన్నారు. అదే రోడ్డులో ఒక దూడ చనిపోయి రోడ్డుపై పడిపోవడం జరిగిందని, ఇప్పటివరకు దాన్ని అక్కడి నుంచి తీసివేసే కార్యక్రమం మున్సిపల్ అధికారులు చేయలేదని తెలిపారు. ఆ ఏరియా అంతా దుర్గంధం వ్యాపించిందని, వల్లప్ప చెరువు నుంచి నీరు కిందకి పారుతూనే ఉందని, ఈ ప్రవాహం వల్ల అక్కడ హైవే రోడ్డు కూడా పాడైపోయిందని, హైవే రోడ్డు వద్ద ఒక అలుగు ఏర్పాటు చేసినట్లయితే వర్షాలు వచ్చినప్పుడు, నీరు ఎక్కువగా వచ్చినప్పుడు అలుగు ద్వారా బయటికి వెళ్లిపోతాయని ఆయన సూచించారు.

వల్లపచెరువులో మిగిలిన నీటిని పట్టణంలోని తాగునీటి అవసరాలకు కూడా వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అంతేకాకుండా వల్లప్పచెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ (Walking track) నిర్మిస్తే పాదాచారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, గతంలో ఏదైతే నరసరావుపేట శివారు ప్రాంతాలను మున్సిపాలిటీలో కలిపామో అక్కడ చెత్తను ఎత్తివేయడానికి పారిశుద్ధ కార్మికులు ఎవరూ రావడంలేదని, తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి అక్కడి నుంచి చెత్త ఎత్తివేసే కార్యక్రమం నిర్వహించాలని ఈ సందర్భంగా కోరారు.

అదేవిధంగా పాలపాడు రోడ్డు నుంచి రామిరెడ్డి పేట వైపు వెళ్లే కనెక్టింగ్ రోడ్డు వద్ద ఒకచోట నీళ్లు బ్లాక్ అయ్యాయని చెప్పి మూడు నెలల క్రితం అక్కడ రోడ్డును పగలగొట్టడం జరిగిందన్నారు. అక్కడ రోడ్ అంతా గుంతలమయంగా ఉందని, అటువైపు నుంచి వెళ్లే వాహనదారులు అక్కడ గుంతలు ఉన్నాయని తెలియక యాక్సిడెంట్లు (Accidents) జరుగుతున్నాయ‌ని తెలిపారు. తక్షణమే ఆ రోడ్డు రిపేర్ చేసి కల్వర్టు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పట్టణంలోని కమర్షియల్ కాంప్లెక్స్ ల నుంచి చెత్త ఎత్తివేయడానికి పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని తక్షణమే ఈ కార్యక్రమాన్ని నిలిపివేసి మున్సిపాలిటీ ద్వారా కమర్షియల్ కాంప్లెక్స్ ల నుంచి చెత్త ఎత్తివేయాలని ,అందుకుగాను మున్సిపల్ అధికారులే తక్కువ మొత్తంలో పన్ను వసూలు చేయాలని అన్నారు.

మున్సిపాలిటీలో అభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహించటానికి సరిపడా నిధులు ఉన్నా.. పట్టణంలో ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదని గోపిరెడ్డి విమర్శించారు. మున్సిపల్ కాంట్రాక్టులు చేయడానికి కాంట్రాక్టర్లు (Contractors) ఎవరూ ముందుకు రావడంలేదని, మున్సిపాలిటీలో ఒకరిద్దరూ మాత్రమే కాంట్రాక్టులు చేయాలని అనధికారికంగా నిబంధన ఉందని అందువల్ల వాళ్ళిద్దరే టెండర్లు వేయాలని , అందువల్ల టెండర్లు వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదన్నారు. నరసరావుపేటలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో ఒకటి, రెండు చోట్ల మాత్రమే కల్వర్టులు కట్టారు తప్ప, ఇంతవరకు ఏ పని చేసినా పాపాన పోలేదని విమర్శించారు. స్థానిక ప్రకాష్ నగర్‌లో రోడ్డు వేయడానికి అక్కడున్న ప్రజల నుంచి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారని, గతంలో ఎప్పుడు మున్సిపాలిటీ అధికారులు రోడ్లు వేయడానికి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేయలేదని, ఎందుకు ఈ రకంగా అనధికారికంగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు?

ఇది సరైన పద్ధతి కాదని, గతంలో శివారు ప్రాంతాల్లో కొంత భాగం మున్సిపాలిటీలో కలపడం జరిగిందని ,వారు మున్సిపల్ ట్యాక్స్ సైతం కడుతున్నారని , అటువంటిది వారి వద్ద నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు (Collection of money) చేసి రోడ్లు వేయటం మంచి పద్ధతి కాదని ,హెచ్చరించారు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఏ రకంగా రేపు ఎన్నికలకు ప్రజల ముందుకు వస్తారని, తక్షణమే మున్సిపాలిటీ అధికారులు పట్టణ పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని, ఎక్కడైతే రోడ్లు గుంతలు పడ్డాయో అక్కడ రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. అనధికారికంగా ఉన్న చెత్త డంపు లను ఎత్తివేయాలని ఈ సందర్భంగా గోపిరెడ్డి స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply