మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమివ్వడం తెలంగాణకు గర్వకారణం
తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే సువర్ణావకాశం
140 దేశాల నుంచి వస్తున్న అందాల భామలు
తెలంగాణ పేరు విశ్వవిఖ్యాతమయ్యే అవకాశం
రాజకీయాలకు అతీతంగా అందరు మద్దతు ఇవ్వాల్సిన సమయం
మిస్ వరల్డ్ కార్యక్రమం మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి

హైదరాబాద్ – మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు,. ఇది మహిళా సాధికారతకు అద్దం పట్టే సంబరాలు అని, ప్రపంచ దేశాల నుంచి రాబోయే అతిథులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేందుకు ఇదొక గొప్ప అవకాశం అని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ మిస్ వరల్డ్ 2025 పోటీలకు ఆతిథ్యమివ్వనుంది. మే 7 నుండి 31వ తేదీ వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ అందాల పోటీల్లో సుమారు 140 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొనబోతున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చే ఈ వేదిక, రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయనుంది. ఈ పోటీల సందర్భంగా, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు మే నెలలో తెలంగాణలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, అభివృద్ధిని వీరు ప్రపంచానికి తెలియజేయనున్నారు. అలాగే ఈ పోటీల నిర్వహణకు రేవంత్ ప్రభుత్వం రూ.250 కోట్ల రూపాయిలను కేటాయింది..
ఈ నేపథ్యంలో ఈ పోటీల ఏర్పాటు గురించి వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లితో పాటు టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి లు పాల్గొన్నారు..

ముందుగా జూపల్లి మాట్లాడుతూ, సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ నెలవని అన్నారు. “ఇది చరిత్రాత్మక కార్యక్రమం. కొత్త రాష్ట్రంలో కొత్త కార్యక్రమం జరుగుతోంది. మహిళల ఆత్మ సౌందర్యాన్ని సెలబ్రేట్ చేయడం మిస్ వరల్డ్ పోటీల ఉద్దేశం. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర గొప్పది. రాష్ట్రంలో అన్ని రంగాల వారికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచానికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం, పర్యటక అందాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. దక్షిణ కొరియాలో స్క్విడ్ గేమ్, బీటీఎస్ బ్యాండ్ లాంటివి ఆ దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణకు పేరు ప్రఖ్యాతులతో పాటు ఆర్థికంగానూ వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, ప్రపంచస్థాయి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇది మంచి అవకాశం. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. అందాల పోటీలను మహిళా సాధికారతకు ప్రతీకగా చూడాలి. ప్రభుత్వంపై విమర్శలకు, రాజకీయ కోణంలోనే మిస్ వరల్డ్ పోటీలను చూడటం సరికాదు. 140 దేశాల నుంచి పోటీదారులు వస్తారు. వారితో పాటు దేశవిదేశాలకు చెందిన వేల మంది చేరుకుంటారు. తెలంగాణ గురించి ప్రపంచానికి చెప్పేందుకు ఇది మంచి అవకాశం. ఈ వేదికతో రాష్ట్ర పర్యటక రంగానికి రాబడి పెరుగుతుంది” అని జూపల్లి కృష్ణారావు అన్నారు.

2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా మాట్లాడుతూ నమస్తే ఇండియా అంటూ తెలుగులో సంబోధించారు.. అనంతరం ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడుతూ, తెలంగాణలో చాలా దేవాలయాలను సందర్శించానని చెప్పారు.. ఆధ్యాత్మిక చింతన తనను ఎంతగానో ఆకట్టుకుందన్ని చెప్పారు. అని రాష్ట్రాలు, దేశాలు కలసి జీవిస్తున్న మినీ ప్రపంచం లాంటి హైదరాబాద్ ఈ ఏడు మిస్ వరల్డ్ పోటీలకు అతిథ్యమివ్వడం మరింత సంతోషంగా ఉందన్నారు..

టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, ఈ ఈవెంట్ రాకతో హైదరాబాద్ కే అందం వచ్చిందని అన్నారు..తెలంగాణను త్రిలింగ దేశమని, తెలుగు భాషకు పుట్టినిల్లు తెలంగాణ అని పేర్కొన్నారు.. ఇటువంటి చోట మహిళ సాధికారతకు అద్దంపట్టే ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.