Medaram | గిరిజన మినీ కుంభమేళ ప్రారంభం … ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
మేడారం మిని జాతర నేటి నుంచి ప్రారంభమైంది. ఈ జాతర ఈ నెల 15వ తేది వరకు కొనసాగనుంది.. తొలిరోజు ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు.. ఇక మేడారంతో పాటు, అనుబంధ గ్రామాలు, ఆలయాలలో ఊరుకట్టు నిర్వహించారు.. ఆలయాలు శుద్ధిచేసి ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజలు జరిపారు..
మేడారం గ్రామంలోని సమ్మక్క ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆదివాసీల వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, వివిధ రకాల ధాన్యం తీసుకొచ్చి వనదేవతలకు సమర్పించారు…. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ ఆలయంలోనీ పూజారులు గద్దెల ప్రాంగణానికి చేరుకొని సాంప్రదాయ పూజలు చేసి, మొక్కులు చెల్లించారు.. కొండాయిలోని గోవిందరాజు ఆలయంలో, పూనుగొండ్లని పగిడిద్దరాజు ఆలయంలో కూడా అదే సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇక బయ్యక్కపేట లో సమ్మక్క పూజారులు ఆదివాసి ఆచార సాంప్రదాయ పూజ నిర్వహించగా, మరోవైపు నాయకపోడు పూజారులుకూడా ఘట్టమ్మ గుట్ట ఆనవాయితీ ప్రకారం పూజలు జరిపారు… అదే సమయంలో పొలిమేర దేవతలకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఈ మినీ జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.. మేడారం గద్దెల వద్ద భక్తులు వన దేవతలను దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు..
మేడారంకు 200 ప్రత్యేక బస్సులు
ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర కు రూ.5.30కోట్లతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇక మేడారం వెళ్లే భక్తుల కోసం 200 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులను నడుపుతున్నారు. ఇది ఇలా ఉంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుండడంతో, వెయ్యిమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. జంపన్నవాగు వద్ద జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునేందుకు గదుల ఏర్పాటు చేశారు.