మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఉదయం సైక్లింగ్ చేస్తూ ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆర్టీసి బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితుల పై ఆరా తీసి ఆర్టీసి బస్సులో తిరుగు ప్రయాణమై ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తన క్యాంప్ కార్యాలయం నుంచి రామాయంపేట బస్టాండ్ వరకు సైకిల్ పై వెళ్లారు. రామాయంపేట బస్టాండ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి బస్టాండ్ లో శుభ్రత కు సంబంధించి ఆర్టీసీ డిఎంకు పలు సూచన చేశారు.
అనంతరము ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ మహాలక్ష్మి పథకం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతీ ఒక్కరూ సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే బస్టాండ్లను ఆధునికరించి బస్టాండ్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ముందుకు వస్తుందని అందులో భాగంగానే మెదక్, రామాయంపేట బస్టాండ్ ను సందర్శించడం జరిగిందన్నారు.