జీవన పరమార్ధం…
భూతేషు భూతేషు విచిత్యధీరా:.. ధీరులైన వారు జీవులయొక్క విషయములను చక్కగా తెలుసుకొని మర్త్యలోకము నుండి ఉన్నత దశను పొందాలని చెపుతుంది కేనోపనిషత్తు. మర్త్యులు అంటే.. మృత్యువును సమీపించేవారు… మానవులు. మానవలోకం పరిణతిని సాధించే వేదికగా తెలుసుకొని భౌతిక ఆధ్యాత్మిక జీవితాలలో సమత్వాన్ని పాటించే వారు ధీరులుగా చెప్పబడుతారు. వారే అమరులౌతారు.
సృష్టి క్రమంలో జీవరహిత స్థితి, జీవమున్నా కదలలేని స్థితి, కదలగలిగీ ఆలోచనలేని స్థితులను అధిగమించి, బహుజన్మల అనంతరం, అన్నీ కలిగిన మానవజన్మ కలుగుతుందని పురాణాలు చెపుతున్నాయి. మానవజన్మ శాశ్వతమా అంటే కాదు… కాని, కళ్యాణదాయకమైనది. కాబట్టి, ప్రజ్ఞాచేతస్కులైన వారు… అనివార్యమైన మృత్యువు పలకరించకముందే జీవిత గమ్యమైన భగవంతుని చేరే ప్రణాళికలు రచించుకొని ఆ మార్గంలో పురోగమించాలని ఉపనిషత్తులు ప్రబోధిస్తున్నాయి. కర్మానుభవాన్ని పొందేందుకు అవ్యక్తమైన అపరిమితత్వాన్నుండి పరిమితత్వంతో కూడిన వ్యక్తంగా అవతరించడం పుట్టుక కాగా, భౌతిక జీవన పరిమితులను అధిగమించి అపరిమితత్వంలో లయం కావడం మరణం. పరిమిత జీవితకాలంలో మనిషిని విషయభోగాలు భౌతిక సుఖాలవైపు లాగుతుంటాయి. అయితే, వాటి ఆకర్షణలను అధిగమించి అంతకన్నా ఉన్నతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని సాధించే దిశలో ప్రయత్నంచేయాలి. అలాగని భౌతిక జీవితాన్ని విస్మరించాలని కాదు. భౌతికమైన ప్రేయస్సు, పారలౌకికమైన శ్రేయస్సును సాధించే దిశలో ప్రయత్నించడం వల్ల మాత్రమే జీవితం సార్ధకమౌతుంది.
సృష్టిలో ఒక పదార్ధానికి మరొక పదార్ధంతో సంబంధం ఉంటుంది. ఏదీ ప్రత్యేకమూ కాదు. స్వావలంబనపై మనజాలదు. ఒకటిలేక మరొకదానికి ఉనికిలేదు. పదార్ధం ఉంటే వ్యతిరేక పదార్థం ఉంటుంది. ప్రతి సకారాత్మక సంఖ్యకు నకారాత్మక సంఖ్య ఉంటుంది. అలాంటప్పుడు ”నేను” ప్రత్యేకమని భావించడం అవివేకమని పండితులు చెపుతారు. మానవుని ”అస్మిత” లేదా ”అహం” గురించి వేదాంతం బహుళమైన చర్చనే చేసింది. ”నేను” అనే భావనయే లేకపోతే విశ్వానికి ఉనికి ఉంటుందా? అయితే, వ్యష్టిలోని ”నేను” అనేది విశ్వంలోని అన్ని ”నేనుల” సమష్టితత్త్వం. మానవుడు అపరిణత చిత్తుడైన సమయంలో వ్యక్తిత్వమంటూ వ్యక్తిగత జీవితంపైనే మనసును కేంద్రీకరిస్తాడు. ఎప్పుడైతే విశ్వాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ… దృష్టిని విశాలపరుస్తాడో… అప్పుడు వ్యష్టి జీవితాన్ని కాక సమష్టి జీవితంపై అవగాహన పెంచుకుంటాడు. పరిమితమైన జ్ఞానంలో జీవితం వేదనాభరితమని, అదొక భ్రమయని భావించిన వ్యక్తి… జ్ఞాన పరిమితులను చెరిపి వేసుకుంటున్న సమయంలో జీవితం సాధనాపర్వమని, జీవితానికి ఉదాత్తమైన ప్రయోజనం ఉన్నదని, దానిని సాధించే క్రమంలో ప్రతిక్షణాన్నీ ఆనందంగా ఆస్వాదించాలనే సత్యాన్ని తెలుసుకుంటాడు. లక్ష్యాన్ని చేరడం కాదు… ఆ గమనంలో ప్రతిక్షణాన్నీ ఆస్వాదించాలని తత్త్వవేత్తలు చెపుతారు.
ఉపనిషత్తులను నిశితంగా ఆధ్యయనం చేస్తే… వ్యక్తి విశిష్టవ్యక్తిత్వం విరాడ్వ్యక్తితంలో భాగమని… అందులోనుండి ఆవిష్కతమైన జీవితం తిరిగి అందులోనే లయమౌతుందనే సత్యాన్ని అనుభవ పూర్వకంగా అవగాహన చేసుకోగలుగుతారు. నేను, నాది అనే భావన అనిత్యమైనదే కాక దు:ఖాన్ని కలిగిస్తుంది. అది విపరీత పరిణామాలకూ దారిచూపుతుంది. ”నేనెప్పుడు” ముక్తిని పొందుతానని ప్రశ్నించిన శిష్యునితో.. ”నేను” అనే భావం లేనప్పుడంటారు, రామకృష్ణ పరమహంస.
శిషువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి శరీరంలో భాగంగా పరిగణింప బడతాడు. భూమిపై పడగానే ప్రత్యేకమైన ప్రతిపత్తి కలిగిన జీవిగా పరిగణింప బడతాడు. తానొక ప్రత్యేకమైన వ్యక్తినని నేర్చుకోవడంతో శిషువు ఆధ్యయనం ప్రారంభమౌతుంది. శిషువు పెరుగుతూ అవగాహనను పెంచుకునే క్రమంలో చుట్టూ ఉన్న సమాజంతోనూ వాతావరణంతోనూ అనుబంధాన్ని పెంచుకుంటాడు. దానితో కర్తృత్వభావన పెరుగుతుంది. అది అతడి ”అహంభావాన్ని” పెంచుతుంది. అహంభావాన్ని ప్రదర్శించేందుకు అనుగుణంగా తన శక్తిసామర్ధ్యాలను పెంచుకోవడమే కాక ప్రభావాన్నీ పెంచుకుంటూ ”నేనూ” నుండి ”నేనే” అనే భావనను పొందుతాడు. అయితే సరైన గురువుల సాంగత్యంలో శిక్షితుడైన వ్యక్తిలో అహంభావం స్థానంలో అవగా#హన పెరుగుతుంది. సమాజంలో తానూ భాగమనే సత్యాన్ని తెలుసుకుంటాడు. వ్యక్తిత్వం విశాలతను సంతరించుకొని ప్రేమగా పరివర్తన చెందుతుంది. సాధనలో బ్రహ్మతత్త్వం యొక్క పరిపూర్ణతను ఆస్వాదించ గలుగుతాడు. ఇప్పుడే ఇక్కడే ఆత్మ సాక్షాత్కారం పొందడమే లక్ష్యంగా సాగే విద్యను ఆశ్రయించి యదార్థమైన గమ్యాన్ని చేరుకునే సాధన చేస్తాడు.
ప్రేత్య అస్మాత్ లోకాదమృతా భవంతి! మరణించడం అంటే… నేనూ నాది అనే భావనలను గలిగిన భౌతిక ప్రపంచాన్ని విడిచి, సర్వాత్మ భావాన్ని, అద్వైతస్థితిని పొంది అమరత్వాన్ని పొందడం అంటారు… ఆదిశంకరాచార్య.
- పాలకుర్తి రామమూర్తి