పెద్దమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని పట్టణ కౌసల్య దేవి ఫౌండేషన్ చైర్మన్ జ్ఞాన ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ ఆలయం వద్ద ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జ్ఞాన ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాల వల్ల ఆలయం వద్ద ఉన్న రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని గుర్తు చేశారు. భక్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తన సొంత నిధులతో రహదారిని మరమ్మతులు చేయించినట్లు తెలిపారు.

సమాజ సేవలో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

జ్ఞాన ప్రకాష్ రెడ్డి అందిస్తున్న సేవలను ముదిరాజ్ సంఘం ప్రతినిధులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బిక్షపతి, మండల సంఘం అధ్యక్షుడు బండి రాములు, పట్టణ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply