Loksabha |నేడు లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ..
న్యూ ఢిల్లీ – లోక్‌సభలోకి వక్ఫ్ సవరణ బిల్లును నేడు ప్రవేశపెట్టనున్నారు.. ఈ బిల్లులో 14 నిబంధనల్లో.. 25 సవరణలు చేశారు. మొత్తం 655 పేజీల బిల్లు ఉంది. దీన్ని జనవరి 30న లోక్‌సభ స్వీకర్‌కి జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్ ఇచ్చారు. అందువల్ల ఇవాళ కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి లోక్‌సభలో ప్రవేశపెడతారు.ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది.
ఈ జేపీసీలో అధికార, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. అంటే.. ఈ బిల్లు పట్ల ప్రతిపక్షాలు కూడా అనుకూలంగా ఉన్నట్లే అని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి జేపీసీలో.. ప్రతిపక్ష నేతలు.. 44 మార్పులను సూచించారు. వాటిని జేపీసీ ఛైర్మన్ ఒప్పుకోలేదు. అదే సమయంలో.. ఎన్టీయే పక్షాల సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలకు మాత్రం జేపీసీ ఆమోదం తెలిపింది. వీటికి ఎన్డీయేలోని 16 మంది సభ్యులు ఆమోదం తెలపగా.. విపక్షాలకు చెందిన 10 మంది ఎంపీలు వ్యతిరేకించారు. అందువల్ల ఈ బిల్లు లోక్‌సభకు వచ్చినప్పుడు.. రచ్చ రేగే అవకాశాలు ఉన్నాయి.
వక్ఫ్ బిల్లు అనేది మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది. 1995లో జేపీసీ, 14 నిబంధనల్లో 25 సంవరణలు చేసింది. ప్రధానంగా ఈ బిల్లు ద్వారా… వక్ఫ్ ఆస్తులుగా ఉన్నవాటిపై కేంద్రానికి నియంత్రణ ఉంటుంది. తద్వారా ఆస్తుల ఆక్రమణ, దుర్వినియోగం వంటి వాటికి చెక్ పెట్టాలన్నది కేంద్రం ఆలోచన. ఐతే.. ఈ బిల్లులో కొన్ని మార్పుల్ని కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి.
వక్ఫ్ ఆస్తులు అంటే ఏంటి?:
వక్ఫ్ అనేది అరబిక్ పదం, దీనికి అర్థం ‘ఎండోమెంట్’. ఇది ముస్లింలు విరాళంగా ఇచ్చిన ఆస్తుల్ని సూచిస్తుంది. ఇలా ఇచ్చే ఆస్తిని వక్ఫ్‌గా ప్రకటిస్తే, అది దేవుడికి చెందినట్లు లెక్క. సమాజ ప్రయోజనం కోసమే దాన్ని ఉపయోగించాలి. భారతదేశ వక్ఫ్ ఆస్తులు, 1995 వక్ఫ్ చట్టం కిందకు వస్తాయి. వక్ఫ్ ఆస్తుల్ని కాపాడేందుకే ఈ చట్టం. దీని వల్ల వక్ఫ్ ఆస్తుల్ని గుర్తించి, దర్యాప్తు చేసే బాధ్యత అధికారులకు ఉంది. వక్ఫ్ ఆస్తుల్ని ఎవరైనా ఆక్రమిస్తే, జరిమానా వేస్తారు. వక్ఫ్ చట్టానికి 2013లో చేసిన సవరణల ప్రకారం.. వక్ఫ్ ఆస్తులను అమ్మకూడదు, బదిలీ చెయ్యకూడదు.