అదిగో చిరుత….

అదిగో చిరుత….
- గద్వాల జిల్లాలో చిరుత పులి దాడి
- సీసీ పుటేజ్ లో రికార్డు అయిన చిరుత సంచారం దృశ్యాలు
- మూడు నెలల్లో 8 ఆవులను చంపిన చిరుత
- గత మూడు నెలలుగా భయాందోళనలో గ్రామస్తులు
- చిరుతను బందించేందుకు అటవీశాఖ అధికారుల ముమ్మర ఏర్పాట్లు
గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; అదిగో పులి.. ఇదిగో పులి అంటూనే నెలలు గడిచాయి. పులి కనిపించింది అనే గ్రామస్తులు మొరపెట్టుకున్న పట్టించుకోని అటవీశాఖ అధికారులు.? మా గ్రామంలో పులి సంచరిస్తుంది జంతువులను బలి తీసుకుంటుంది అని చెప్పిన మూడు నెలలుగా పట్టించుకోని అటవీశాఖ అధికారులు చివరకు ఏప్రిల్ 9న చిరుత సంచరించే ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు అమర్చగా ఏప్రిల్ 10న ఒక దూడను చంపే దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ కు చిక్కాయి. ఈ చిరుత సంచారం మల్దకల్ మండలము, నేతువాణి పల్లి గ్రామ పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఎక్కడ ఎప్పుడు ఏవిధంగా గ్రామస్తులపై దాడిచేస్తుందోనంటూ స్థానికులు ప్రతి నిత్యం భయంతో బెంబెలెత్తిపోతున్నారు. చిరుత కదలికలపై నిఘా పెట్టిన అటవీ ప్రాంతంలో ప్రత్యేక సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం రాత్రి చిరుత నేతువానిపల్లి గ్రామ సమీపంలో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ మేరకు అటవీశాఖ అధికారులు చిరుతను ఏ విధంగా బోనులో బంధించాలనే కోణంలో పథకాలు రచిస్తున్నారు. శుక్రవారం అటవీప్రాంతంలో అధికారులు పర్యటించి మరో సారి చిరుత కదలికలపై నిఘా పెట్టే అవకాశం ఉంది.
ఎట్టకేలకు చిరుతను బంధీచేసే యత్నంలో అటవీశాఖ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపట్టారు. గత కొన్ని నెలలుగా మల్దకల్ మండలంలో సంచరిస్తున్న చిరుతను ఎట్టకేలకు ఫారెస్టు అధికారులు కనిపెట్టారు. మండలంలో ఆయా గ్రామాలల్లో మూగ జీవులపై గుర్తు తెలియని జంతువు దాడి చేసి అపహరించి ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించారు. నేతువానిపల్లి గ్రామ శివారులోనే మూడు నెలల్లో ఏకంగా 8 ఆవుదూడలు చిరుతదాడిలో మృతి చెందాయి. దీంతో బెంబేలెత్తిన గ్రామస్తులు చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
వ్యవసాయ పొలాలో పడిన కాళ్ల ముద్రల కొలతలు సేకరించిన అధికారులు ఇదీ కచ్చితంగా చిరుత జాడలే అని దృవీకరించారు. తాజాగ నేతువానిపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానించడంతో చిరుత కదలికలను గమనించేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగ్గారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు ఆధ్వర్యంలో నేతువానిపల్లి అటవీ ప్రదేశంలో ప్రత్యేక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
చనిపోయిన ఓ మూగ జీవిని అడవిలో వదిలేసి సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షించారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ సీసీ కెమెరాలో చిరుతపులి సంచరిస్తున్న వీడియో రికార్డు అయ్యింది. మూగజీవిని తీసుకెళ్లే దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. వీలైనంత త్వరగా చిరుతను బంధించే ప్రయత్నం చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారులు వెల్లడించారు.
