అలసత్వం తగదు

  • చట్ట వ్యతిరేకులను
  • ఉపేక్షించవద్దు
  • గంజాయి, జూదం సహించొద్దు
  • మహిళలు.. చిన్నారుల రక్షణే ధ్యేయం
  • జనంతో ఫ్రెండ్లీగా ఉందాం
  • శ్రీ సత్యపాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడి


(శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ ) : జిల్లాలో చట్ట వ్యతిరేక శక్తులను అరికట్టి, శాంతిభద్రతలకు ఏమాత్రం ఆటంకం లేకుండా పోలీసులు తమ విధులను నిర్వహించాలని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. చట్ట వ్యతిరేక శక్తులను ఏమాత్రం ఉపేక్షించవద్దని ఆయన స్పష్టం చేశారు. కదిరి డీఎస్పీ కార్యాలయం, కదిరి పట్టణ, రూరల్ స్టేషన్లు, రూరల్ సర్కిల్ ఆఫీస్ లను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులలో నిర్లక్ష్యంగా ఉండకుండా ఫిర్యాదుదారుల పట్ల అలసత్వంగా వ్యవహరించకుండా నిబద్ధతతో విధులు నిర్వహించి నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్ ,లాకప్ గదులు, మహిళా హెల్ప్ డెస్క్, పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి, పెండింగ్ లో ఉన్న కేసులపై ఆరాతీశారు.

కదిరి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ప్రధానంగా ఆయా ప్రాంతాలలో నమోదవుతున్న కేసుల గురించి, శాంతి భద్రతల సమస్యల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అమలు చేయవలసిన కార్యాచరణను దిశా నిర్దేశం చేశారు. ప్రధానంగా మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత కల్పించాలన్నారు.రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేయడంతో పాటు విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

రాత్రిపూట గ్రామాలను సందర్శించి (నైట్ హాల్ట్ ) లు చేపట్టి శక్తి యాప్ , బాల్య వివాహాలు,వివిధ సైబర్ నేరాలు, మోసాల తీరును వివరించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కల్పించాలన్నారు. గంజాయి, జూదం, అక్రమ మద్యం అరికట్టే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు.రౌడీ షీటర్స్, పై ప్రత్యేకంగా నిఘా పెట్టాలిని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది విధులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలు ఏమున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సిబ్బందికి సూచించారు. జిల్లా ఎస్పీ వెంట డీఎస్పీ శివ నారాయణస్వామి, సిఐలు డివి నారాయణరెడ్డి,నాగేంద్ర, నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు ఉన్నారు.

Leave a Reply