AGENCY | లష్కర్ పోస్టుకు లక్షల్లో వసూళ్లు..!

AGENCY | లష్కర్ పోస్టుకు లక్షల్లో వసూళ్లు..!
–ఇరిగేషన్ లో బాగోతం—
- యూపీఏఆర్ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకాలు
- ఇష్టానుసారం దండుకుంటున్న ఏజెన్సీ నిర్వాహకులు
- నియంత్రించే అధికారులెవరు?
- నియామక అభ్యర్థులకు అర్హతలున్నాయా?
AGENCY | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లాలో నీటి పారుదల శాఖలో లష్కర్ పోస్టుల నియామకాలను ఓ ఏజెన్సీ బేరం పెడుతోంది. కనీస అర్హతలు లేని యూపీఏఆర్ ఏజెన్సీకి ఇచ్చినట్లు- ఆరోపణలు వస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే కాంట్రాక్ట్ ఏజెన్సీకి మూడు సంవత్సరాలకు గాను 30 లక్షల బ్యాంక్ టర్నోవర్, 6 నెలల ఈపీఎఫ్, జిఎస్టీ, ఈఎస్ఐ పేమెంట్ చేసిన ఏజెన్సీలనే ఎంపానల్మెంట్ చేసి నియామక అనుమతులు ఇవ్వాలి. కానీ ఇలాంటి అనుమతులు ఏమీ లేకుండానే రాజకీయ నేతల సిఫారసుతో జిల్లాలో సదరు ఏజెన్సీ కి ఇరిగేషన్ శాఖలో లష్కర్ పోస్టుల నియామకానికి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. హుజూర్ నగర్ డివిజన్ పరిధిలో 80, సూర్యాపేట డివిజన్ పరిధిలో 74 మంది లస్కర్ లను నియమించేందుకు ఆ ఏజెన్సీ గత ఆగస్ట్‌లో ఒక దినపత్రికలో ప్రకటన ఇచ్చి లష్కర్ నియామకాలకు దరఖాస్తులు స్వీకరించి ఒక్కో లష్కర్ పోస్ట్ నియామకానికి 2 నుండి 3 లక్షలు వసూలు చేస్తున్నట్లు- సమాచారం.
(ఆంధ్రప్రభ , నిఘావిభాగం)
ఇరిగేషన్లో కాంట్రాక్టు పద్దతిలో ఖాళీలను నింపేందుకు ప్రభుత్వం నుండి అనుమతి పొందిన ఓ ఏజెన్సీ (యూపీఏఆర్) ఇష్టాను సారం వ్యవహరిస్తోంది. అర్హతలు పక్కన పెట్టి… నియామక నిబంధలను తోసి రాజని… సంపాదనే పరమావధిగా సదరు సంస్థ అడులేస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగార్హులు…తమకు భవిష్యతులో ఉద్యోగం శాశ్వతమవుతుందన్న ఆశతో.. ఏజెన్సీ మాయమాటలకు గులాం అంటూ లక్షలు…లక్షలు చెల్లించేస్తున్నారు. మరీ ఆశ్చర్యమేమంటే…ఎంపానల్మెంట్ లో అర్హత లేని యుపిఎఆర్ ఏజెన్సీకి ఎలా అనుమతులు ఇస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ విషయంలో అన్ని అర్హతలు ఉన్న ఏజెన్సీలు కొన్ని హై కోర్ట్ లో రిట్ పిటిషన్ వేయడంతో విచారణ చేసిన హైకోర్టు యూపీఎఆర్ ఏజెన్సీ తో పాటు- మరో ఐదు ఏజెన్సీలకు అర్హత లేదని సస్పెండ్ చేసింది.
లష్కర్ పోస్టుల భర్తీకి ఆ ఏజెన్సీకే కట్టబెట్టడంపై పలు అనుమానాలు..?
హుజూర్ నగర్ నియోజక వర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం మాజీ ప్రజాప్రతినిధి 2025 ఏప్రిల్ లో కొత్తగా యూపీఏఆర్ ఏజెన్సీ ఏర్పాటు- చేసుకుని ఆ ఏజెన్సీ కి ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకానికి కనీస అర్హతలు లేకున్న యూపీఏఆర్ ఏజెన్సీ కే సూర్యాపేట హుజూర్ నగర్ రెండు డివిజన్ ల పరిధిలోని లష్కర్ లను నియమించేందుకు కాంట్రాక్ట్ ఇవ్వడం పై పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటికే సదరు ఏజెన్సీ ఒక్కో లష్కర్ పోస్ట్ కు రూ.2 నుండి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు- తెలుస్తోంది. గతంలో ఇదే మాజీ ప్రజాప్రతినిధి గరిడేపల్లి కి చెందిన తేజ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా హుజూర్ నగర్, కోదాడ నియోజక వర్గాలలో ఇరిగేషన్ శాఖలో (పంపు ఆపరేటర్, పిట్టర్, వాచ్ మెన్ తదితర విభాగాల్లో) 99 పోస్టులకు గాను 2024 అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇచ్చి నాలుగు నెలల 2025 మార్చి వరకు కాల పరిమితి తో కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుకుని వారి వద్ద నుండి కూడా లక్షల్లో వసూలు చేసినట్లు- సమాచారం. ఈ పోస్ట్ ల్లో నియామకం చేయబడ్డవారికి మార్చి నెల నుంచి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఆంధ్రప్రభ ఎదుట వాపోయారు.
పూర్తి స్థాయిలో విచారణ జరగాలి
ఇరిగేషన్ శాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టుల నియామకానికి కనీస అర్హతలు లేని ఏజెన్సీ కి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక్కో పోస్టు కు లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్న విషయం పై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఉద్యోగం వస్తుందని లక్షల రూపాయలు ఇస్తున్న నిరుద్యోగ కుటు-ంబాలు సదరు ఏజెన్సీ ల చేతుల్లో మోసపోకుండా చూడాలని ప్రజలు కోరుచున్నారు. హుజూర్ నగర్ శాసనసభ్యులు రాష్ట్ర ఫౌరసఫరాల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి లకు తెలిసే ఇవి జరుగుతున్నాయా.. అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే సదరు ఏజెన్సీ నిర్వాహకుడు ఒక్కో పోస్టు నియామకానికి వసూలు చేసే డబ్బుల్లో సింహభాగం ఆ రెండు నియోజక వర్గాలకు ఇద్దరు బాసు లకు ఇవ్వాలని డైరెక్టుగా ఉద్యోగార్థులతో చెపుతున్నట్లు- సమాచారం.
