మానవుని ఊహకి అందని ఈ అనంత విశ్వమునకు అతీతుడు శ్రీకృష్ణ భగవానుడు. ధర్మసంస్థాపనార్థము అవతరించుట దైవ ధర్మం. అనగా, ఈ మహాకాల యుగవర్తనమునకు సూత్రధారి ఆ పరమాత్మ అవతారములు అన్నింటిలో శ్రీ కృష్ణావతారము ఒక అద్భుతము.

ఈ లీలావతారంలోని అంతరార్థము ఒక దివ్యమైన మురళీగానము. అదియే కర్మ, జ్ఞాన, భక్తి, యోగం ఈ మాయా ప్రపంచంలో మానవ జన్మ ఒక గొప్ప మాయ. ఇది మాయ అని తెలిసే లోపు జీవిత కాలము ముగుస్తుంది అతి స్వల్పమైన ఈ కాలములోనే జన్మ ప్రయోజనం తెలుసుకొని సార్ధకం చేసుకోవడానికి ఒక గురువు తప్పనిసరి.

ఆ పరమ జగద్గురువే శ్రీకృష్ణ పరమాత్మ. “కృష్ణం వందే జగద్గురుం” కావున ఆ భగవానునికి సర్వస్య శరణాగతి చేసి భక్తి వందనం సమర్పించినవారు జన్మ సార్ధకమనే సచ్చిదానదం అనుభవంలో తెలుసుకొని అనుభవిస్తారు. “అంతా నేనే చేస్తున్నాను. నా వల్లనే నాకు ఆనందం లభించింది” అనుకోవడమే ఒక పెద్ద అజ్ఞానం. లోతుగా ఆలోచించి సుఖదుఃఖాలను పరిశీలిస్తే ఏది నీ చేతుల్లో లేదనే పరమ సత్యం బోధపడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ సకల జీవులకు జ్ఞానబోధ చేశాడు.

కారాగారంలో జన్మించి నంద కులానికి చేర్చబడి బాల్యము అంతా అజ్ఞాతవాసంలోనే గడిపాడు అవతార సమాప్తి వరకు ఘర్షణతోనే స్నేహం చేశాడు అందరిచే అమితంగా ప్రేమింపబడ్డాడు, ద్వేషించబడ్డాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మానవ జీవితం సుఖదుఃఖాల సమ్మేళనం, ధర్మం కోసం యుద్ధం అనివార్యం. భయంతో ముడుచుకు కూర్చున్నా నిన్ను యుద్ధంలోకి లాగడం తప్పదు. యుద్ధంలో ఆయుధం పట్టక తప్పదు.

అయితే జయాపజయాలు నీ చేతుల్లో ఉండవు. కర్తవ్యనిష్ట ద్వారా కర్మలు చేయడమే నీ వంతు. కర్మలనగా సత్కర్మలని మరవ కూడదు. యుగ ధర్మాన్ని ఎవరైతే అనుసరించి ప్రకృతిని కాపాడుతారో వారికి జయం తప్పక లభిస్తుంది. మానవ హితమే ధర్మము. హితమనగా ప్రకృతికి అనుగుణంగా నడుచుకోవడం. ఆసక్తి సత్కర్మ మీద ఉండాలి తప్ప, ఫలితం మీద కాదు దేహమే దేవాలయం. అంగుష్ట మాత్రుడైన పరమాత్మ, జ్యోతి రూపమున మన అంతరంగమున ప్రకాశిస్తున్నాడు. మౌనము మాత్రమే ఆ ప్రకాశాన్ని దర్శించ గలుగుతుంది.

మౌన ముద్రలో మన హృదయంలోని ప్రణవ శబ్దములు వినవచ్చు. మనలోని దివ్యత్వాన్ని తెలుసుకొని అనుభూతి పొందాలంటే నిష్కల్మషమైన భక్తి యోగాన్ని ఆశ్రయించాలి. దివ్యత్వమే పరమానందం. ఎవరైతే మనసును జయిస్తారో వారికి దివ్య రాజయోగం వశమవుతుంది. యోగమంటే లక్ష్యం.. ఆ లక్ష్యం ఆనందమయంగా ఉండాలంటే, సృష్టికర్త పరమాత్మను సదా దృష్టిలో ఉంచుకొని మన సత్కర్మలు కొనసాగించాలి.

శ్రీకృష్ణ పరమాత్మ “నన్నే ఆశ్రయించండి” అని చెప్పడంలో గల రహస్యం లక్ష్యసాధనకు కొరకు ఏకాగ్రత అవశ్యం. ఆ ఏకాగ్రత ఆయుధమే “కృష్ణ” అను రెండు అక్షరాలు గీతాచార్యుడిగా మానవుడికి బోధించవలసినదంతా భగవద్గీతలో నిక్షిప్తం చేశాడు.

అందుకే భగవద్గీత విశ్వమత గ్రంథం. ఏమి తినాలో తినకూడదు లాంటి సూక్ష్మముల నుండి ఆత్మయే నిత్య సత్యం అని స్థూలం వరకు విశద పరిచిన కలియుగ విజ్ఞాన శాస్త్రమైన శ్రీ భగవద్గీతను యువత యువకులు తప్పనిసరిగా అధ్యయనం చేసి పాటించాలి. అప్పుడు మాత్రమే సచ్చిదానందం అంటే అనుభవంలోకి వస్తుంది.

-వారణాశి వెంకట సూర్య కామేశ్వర రావు

Leave a Reply