పంట పొలాలకు నీటి కోసం ఎదురుచూపులు..

పంట పొలాలకు నీటి కోసం ఎదురుచూపులు..
పంట కాలువలు నిర్మిస్తే వచ్చే ఏడాదికే 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు సాధ్యం…
రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమలో దశాబ్దాలుగా సాగు, త్రాగు నీటి కోసం అల్లాడుతున్న రాయలసీమ గడ్డపై పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రజలలో చైతన్య స్పూర్తిని నింపేలా గేయాలను విడుదల చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి నేడు మరో గళాన్ని విప్పింది. ఈ సందర్భంగా రాయలసీమ రైతుల ఆవేదనను, పాలకుల ప్రాధాన్యత లోపాలను ఎండగడుతూ రూపొందించిన ఒక ప్రత్యేక ఆడియో గీతాన్ని నంద్యాల సమితి కార్యాలయంలో సమితి కోశాధికారి చెరుకూరి వెంకటేశ్వర నాయుడుతో గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ తెలుసుకో నాయకా.. ఏది ముందో ఎరగరా.. ప్రాధాన్యత పనులు పక్కన పెట్టి పాలన సాగిస్తే ప్రయోజనం ఏమిరా?” అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు పొంతన లేదని సమితి కార్యవర్గ సభ్యులు విమర్శించారు. కృష్ణా నదిలో నీళ్లున్నా, ప్రాజెక్టులు పూర్తయ్యాయని పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నా, పొలాల దాకా నీరు చేరకపోవడానికి కారణం పంట కాలువల నిర్మాణం పూర్తికాకపోవడమేనని వారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు.
గోదావరి – బనకచర్ల అనుసంధానం అంటూ కోటలు దాటే మాటలు చెబుతున్న పాలకులు, కనీసం గొంతెండిపోతున్న ప్రజలకు త్రాగునీరు కూడా అందించలేక పోవడం ఉట్టి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. తడారిన గొంతులు, ఎండిన పంట పొలాలు సీమ విషాదానికి నిదర్శనాలనీ.. త్రాగునీటి కోసం మహిళలు పడుతున్న మానసిక వేదనను ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడాలని డిమాండ్ చేశారు.
జలసంరక్షణ చేస్తేనే రాయలసీమకు వెలుగు అనీ.. పాలకులు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కాలువల నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే అది నిజమైన పాలన అనిపించుకుంటుందని హితవు పలికారు.రాయలసీమ ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయించి, పెండింగ్‌లో ఉన్న పంట కాలువల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, రాయలసీమ గుండెల్లో ఆశలు నింపేలా నిజమైన జలకళను తీసుకురావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి, ఉపాధ్యక్షులు యర్రం శంకర్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి పట్నం రాముడు, మహేశ్వరరెడ్డి, కొమ్మా శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, జానో జాగో మహబూబ్ భాష, నిట్టూరు సుధాకర్ రావు, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
