- 5-0తో మకావుపై ఘన విజయం
చైనా వేదికగా ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ ఆసియా మిక్స్‌డ్ టీమ్ ఛాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్-డిలో భాగంగా బుధవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5-0తో మకావుపై ఘన విజయం సాధించింది.
సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్ డబుల్ మ్యాచుల్లో భారత షట్లర్లు ఏక పక్షంగా విజయాలు సాధించి టోర్నీలో అదిరే ఆరంభం చేశారు. ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి మ్యాచ్‌లో భారత యువ స్టార్ లక్ష్యసేన్ 21-16, 21-12 తేడాతో ఫోంగ్ పాంగ్‌పై అలవోకగా విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్‌లో సిందు గైర్హాజరీలో బరిలోకి దిగిన మాళవిక బన్సోద్ 21-15, 21-9 తేడాతో వయి హౌ చాన్‌ను వరుస గేముల్లో చిత్తు చేసింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సతీష్ కరుణాకరణ్-ఆద్య వరియత్ జోడీ 21-10, 21-9 తేడాతో చొంగ్ లొక్ లియాంగ్-చీ వెంగ్ ఎంగ్ జంటపై గెలుపొందారు.
మహిళల డబుల్స్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్ గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ 21-10, 21-5 తేడాతో చీ వెంగ్ ఎంగ్-వయి హౌ చాన్ ద్వయాన్ని వరుస గేముల్లో ఓడించి మ్యాచ్‌ను ఏక పక్షంగా సొంతం చేసుకున్నారు.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో ఎమ్.ఆర్. అర్జుత్‌తో జతకట్టిన చిరాగ్ శెట్టి 21-15, 21-9 తేడాతో చొన్ చి పుయ్-వెంగ్ కోక్ వాంగ్ జోడీపై విజయం సాధించి భారత్ విజయాన్ని పరిపూర్ణం చేశారు. ఇక నేడు (గురువారం) జరిగే రెండో మ్యాచ్‌లో భారత్ పటిష్టమైన దక్షిణా కొరియా జట్టుతో తలపడనుంది.